Warangal: రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ దారుణ హత్య.. తాళ్లతో బంధించి చిత్ర హింసలు పెట్టి

| Edited By: Ram Naramaneni

Dec 03, 2024 | 4:56 PM

వరంగల్‌లో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మర్డర్ సంచలనం సృష్టించింది.. అత్యంత దారుణంగా పెంపుడు కుక్కలను కట్టేసే గొలుసులు - తాళ్లతో నిర్బందించి చిత్ర హింసలు పెట్టి హతమార్చిన దుండగులు నగరం మొత్తం ఉలిక్కిపడేలా చేశారు.. కారులో ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి పబ్లిక్ ప్లేస్‌లో వదిలేశారు..

Warangal: రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ దారుణ హత్య.. తాళ్లతో బంధించి చిత్ర హింసలు పెట్టి
Rajmohan
Follow us on

వరంగల్‌ పట్టణంలోని రంగంపేటలో దారుణహత్య సంచలనం రేపింది. రాజమోహన్‌ అనే రిటైర్డ్‌ బ్యాంక్ మేనేజర్‌ హత్యకు గురవడం కలకలం సృష్టించింది. కాళ్లు, చేతులను తాళ్లు, గొలుసులతో కట్టేసి.. రాజమోహన్‌ను అతికిరాతకంగా హత్య చేశారు దుండగులు. ఆ తర్వాత మృతదేహాన్ని కారు వెనక భాగంలో పెట్టి.. రంగంపేటలోనే పార్క్‌ చేసి పారిపోవడం వరంగల్‌ ప్రజల్ని ఉలిక్కి పడేలా చేసింది.

ఘటనాస్థలానికి చేరుకున్న వరంగల్‌ పోలీసులు.. హత్యపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలంలో క్లూస్‌ టీమ్‌తో వివరాలు సేకరించారు. అయితే.. కారును రంగంపేటలో రోడ్డుపక్కన పార్క్‌ చేసి ఓ వ్యక్తి పారిపోతున్న దృశ్యాలు.. సీసీ ఫుటేజ్‌లో రికార్డ్‌ అవడంతో అతను ఎవరనే దానిపై పోలీసులు ఫోకస్‌ పెట్టారు.

ఇక.. తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో మాస్క్‌ ధరించి ఉన్న ఓ వ్యక్తి.. కారు పార్కింగ్ చేసి దర్జాగా వెళ్ళిపోతున్నట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్‌ అయింది. దాంతో.. రాజమోహన్‌ హత్యలో అతనొక్కడే ఉన్నాడా.. లేక.. ఇంకెవరి పాత్ర అయినా ఉందా అనే కోణంలోనూ విచారిస్తున్నారు వరంగల్‌ పోలీసులు. రాజమోహన్ ఒంటిపై ఉండే బంగారం కోసం ఏమైనా హత్య చేశారా అనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే.. మృతుడు రాజమోహన్‌కు ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు ఏమైనా ఉన్నాయా?.. వ్యక్తిగత కక్షలు, భూవివాదాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపైనా ఆరా తీస్తున్నారు. హనుమకొండ రాఘవేంద్రనగర్ కాలనీ చెందిన వెలిగేటి రాజమోహన్‌.. వడ్డేపల్లి ఏపీజీవీబీ బ్రాంచ్ మేనేజర్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యారు.

ఈ హత్య వరంగల్‌లో సంచలనం సృష్టించింది.. గతంలో తలా – మొండెం వేరు చేసి హత్యలతో హడలెత్తించిన రంగంపేట ప్రాంతంలో ఈ దారుణం జరగింది.. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుకున్నారు.. చివరి సారిగా అతని ఫోన్ రాత్రి 11 గంటల తర్వాత స్విచ్ ఆఫ్ అయిందని గుర్తించారు.. హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగాల్లోకి దింపారు.. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..