Weather Report: నేటితో వీడనున్న రుతుపవనాలు.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

తెలుగు రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తుండడంతో ఏపీ, తెలంగాణ వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉదయం వేళ చల్లటి వాతావరణం, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం అవ్వగానే తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరి రెండు రాష్ట్రాల్లో మంగళవారం వాతావరణం ఎలా ఉండబోతోందో చూద్దాం.

Weather Report: నేటితో వీడనున్న రుతుపవనాలు.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
Ap And Telangana Latest Weather Update

Updated on: Oct 06, 2026 | 6:56 AM

గత మే నెలలో భారత్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. జూన్ నాటికి తెలంగాణను తాకాయి. ప్రస్తుతం సీజన్ ముగియడంతో ఆ రుతుపవనాలు తెలంగాణ నుంచి నిష్క్రమిస్తున్నాయి. నేటితో నైరుతి రుతుపవనాలు పూర్తిగా తెలంగాణను వీడనున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆహ్లాదకరమైన తేమతో కూడిన వాతావరణం ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

హైదరాబాద్‌లో వాతావరణం:

హైదరాబాద్‌లో ఈ రోజు పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉదయం వేళల్లో చల్లటి గాలులతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని, మధ్యాహ్నం నాటికి ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్‌కు చేరవచ్చని అంచనా వేశారు. సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై, తేమతో కూడిన చల్లటి గాలులు వీచే అవకాశం ఉంది. నగరంలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కూడా కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలో వాతావరణం:

రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో పొడి వాతావరణం, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి చిరుజల్లులు పడే ఛాన్స్ ఉంది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో ప్రధానంగా పొడి వాతావరణం కొనసాగనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం:

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పగటి వేళ పొడి వాతావరణం, సాయంత్రానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us