Telangana: వరుస ప్రమాదాలు , వివాదాలు.. ఆదిలాబాద్ రిమ్స్ డైరక్టర్ పై వేటు!

వరుస ప్రమాదాలు , వివాదాలు, అధికారుల నిర్లక్ష్యంపై ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆదిలాబాద్ రిమ్స్‌లోని వరుస ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం రిమ్స్ డైరక్టర్ పై బదిలీ వేటు వేసింది. సూపరింటెండెంటు నియమాకం తో పాటు కింది‌స్థాయి వరకు‌ ప్రక్షాళనకు‌ రెడీ అయింది. అసలు ఆదిలాబాద్ రిమ్స్ లో ఇంత వరకు ఏం జరిగింది.. క్లియర్‌గా తెలుసుకుందాం.

Telangana: వరుస ప్రమాదాలు , వివాదాలు.. ఆదిలాబాద్ రిమ్స్ డైరక్టర్ పై వేటు!
Adilabad Rims Overhaul

Edited By:

Updated on: Nov 14, 2026 | 10:12 PM

వరుస ప్రమాదాలు , వివాదాలు, ఆరోపణలు, గాలిలో కలిసిన నవజాత శిశువులు.. వరుస ఘటనలతో ఆదిలాబాద్ రిమ్స్ అభాసుపాలైంది. పసికందుల నుంచి యువకుల వరకు ప్రాణాలు కోల్పోయినా.. ఏకంగా పట్టపగలే ప్రాణాలు నిలపాల్సిన ఆస్పత్రిలోని వెంటిలేటర్లు చోరీకి గురైన రిమ్స్ యాజమాన్యం మొద్దు నిద్ర వీడలేదు. కింది స్థాయి సిబ్బంది నుండి రిమ్స్ డైరక్టర్ వరకు అందరిది ఒకటే తీరు. నిర్లక్ష్యం నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపం. భద్రత డొల్లా.. అన్నీ కలిసి రిమ్స్ లో కొండంత శని అన్నట్టుగా మారింది. ఈ వరుస ఘటనలు సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం రిమ్స్ డైరక్టర్ పై బదిలీ వేటు వేసింది. సూపరింటెండెంటు నియమాకం తో పాటు కింది‌స్థాయి వరకు‌ ప్రక్షాళనకు‌ రెడీ అయింది. అసలు ఆదిలాబాద్ రిమ్స్ లో ఇంత వరకు ఏం జరిగింది. డైరక్టర్ బదిలీ, సూపరింటెండెంటు నియామకంతో అన్నీ సజావుగా సాగేనా..?

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు పెద్ద దిక్కుగా సాగుతున్న ప్రభుత్వ వైద్యశాల. పేద, మధ్యతరగతి ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఆశగా వచ్చే ఈ ఆస్పత్రిలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగించాయి. ఒకవైపు వైద్య సేవల్లో నిర్లక్ష్యం ఆరోపణలు.. మరోవైపు ఆస్పత్రి నిర్వహణలో లోపాలు.. ఇంకో వైపు భద్రతా వైఫల్యాలు.. వెరసి రిమ్స్ పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. నెల వ్యవధిలో చోటుచేసుకున్న వరుస ఘటనలు ఆస్పత్రిలో పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలిపింది.

సెప్టెంబర్ 23న రిమ్స్‌లోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (ఎస్ఎన్‌సీయూ)లో అగ్నిప్రమాదం.. ఐదుగురు నవజాత శిశువులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన.. ఈ విషాదం మరువకముందే అక్టోబర్ 28న మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఏడు నెలల గర్భిణి బి.సునీత వైద్యం కోసం రిమ్స్‌కు రాగా.. అత్యవసర చికిత్స అందించడంలో నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరకు ఆమెతో పాటు కడుపులో ఉన్న కవల శిశువులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. వైద్యుల అందుబాటు, అత్యవసర వైద్య సేవలు, రోగుల పర్యవేక్షణపై మరోసారి చర్చ మొదలైంది.

ఇది చాలదన్నట్టుగా అక్టోబర్ 29న తేలు కాటుకు గురైన కాంబ్లే రాహుల్ అనే యువకుడు చికిత్స కోసం రిమ్స్‌కు వచ్చాడు. అయితే తనకు సరైన వైద్యం అందించలేదని, వైద్యులు తనను బెదిరించారని అతడు ఆరోపించినట్లు సమాచారం. ఈ పరిణామాల అనంతరం రాహుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అక్కడితో ఆగ లేదు రిమ్స్.. అక్టోబర్ 30న మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. రోగులకు అత్యవసరంగా ఆక్సిజన్ అందించేందుకు ఉపయోగించే నాలుగు వెంటిలేటర్లు ఆస్పత్రిలోనే చోరీకి గురయ్యాయి. రెండో అంతస్తులోని పల్మనాలజీ విభాగం పరిధిలో ఉన్న ఆర్ఐసీయూ, చెస్ట్, సార్కో, టీబీ వార్డుల నుంచి ఈ పరికరాలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలతో రిమ్స్ పై మీడియో ఫోకస్ పెట్టడంతో అక్టోబర్ 23 న రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అడ్డదారిలో నియామకం అయిన 11 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియమకాల ఘటన వెలుగు చూసింది. వరుస వివాదాలతో అబాసుపాలైన రిమ్స్ ను గాడిలో పెట్టేందుకు ఎట్టకేలకు ప్రక్షాళన చేపట్టింది రేవంత్ సర్కార్.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) డైరెక్టర్‌ జై సింగ్ రాథోడ్ పై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం.డాక్టర్ బలరాం చిట్కేను రిమ్స్ నూతన డైరక్టర్ గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా ఆదేశాలు వెలువరించారు. ఇప్పటివరకు ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జైసింగ్‌ను నాగర్‌కర్నూల్ వైద్య కళాశాల ఇన్‌చార్జి డైరెక్టర్‌గా నియమించారు. ఆసిఫాబాద్ వైద్య కళాశాలలో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ వెంకట్ లకావత్‌ను ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ బలరాం చిట్కే సంగారెడ్డి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జన్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. డైరక్టర్ , సూపరింటెండెంటు పోస్ట్ లనే కాదు త్వరలో బారీ స్థాయిలో కింది‌ స్థాయి సిబ్బంది ని హెచ్ఓడీలను మార్చేందుకు పక్కా ప్రణాళికను సిద్దం చేసింది వైద్యా రోగ్యశాఖ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us