యూపీ నుంచి తెలంగాణకు భారీగా పేలుడు పదార్థాల అక్రమ రవాణా.. వీటిని ఏం చేసేందుకు తెచ్చారంటే?

ఆదిలాబాద్ పోలీసులు భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 20 వేల ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, 90 బూస్టర్లను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. యూపీ నుంచి తెలంగాణకు తరలిస్తున్న ఈ పేలుడు పదార్థాలను ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో సీజ్ చేశారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేసి, మైన్స్, క్వారీలకు విక్రయించే ప్రయత్నాలపై దర్యాప్తు చేస్తున్నారు.

యూపీ నుంచి తెలంగాణకు భారీగా పేలుడు పదార్థాల అక్రమ రవాణా.. వీటిని ఏం చేసేందుకు తెచ్చారంటే?
Adilabad Explosives Seizure

Edited By:

Updated on: Oct 15, 2026 | 4:47 PM

అడవుల జిల్లా ఆదిలాబాద్ పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేకుండా రెండు వాహనాల్లో తరలిస్తున్న రూ. 20 లక్షల విలువైన 20 వేల ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, 90 బూస్టర్లను సీజ్ చేశారు. యూపీ నుంచి తెలంగాణకు అక్రమ రవాణా చేస్తుండగా.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పిప్పర్ వాడా టోల్ ఫ్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా భారీ పేలుడు పదార్థాలను పట్టుకున్నారు ఆదిలాబాద్ పోలీసులు.

ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ కు అక్రమంగా తరలిస్తున్న భారీ పేలుడు పదార్థాలను జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్పర్‌వాడ టోల్ ప్లాజా సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రెండు వాహనాల్లో అనుమానాస్పదంగా పేలుడు పదార్థాలను తరలిస్తున్న ఏడుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వాహనాలను తనిఖీ చేయగా భారీ మొత్తంలో ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, బూస్టర్లు బయటపడ్డాయి.

పోలీసుల ప్రాథమిక విచారణలో పేలుడు పదార్థాలను ఉత్తరప్రదేశ్‌కు చెందిన రవికుమార్ ద్వారా సమకూర్చుకున్నట్లు వెల్లడైంది. అక్కడి కంపెనీ నుంచి ఇతరుల పేర్లపై బిల్లులు తీసుకుని, బూస్టర్ బాక్సుల్లో ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను నింపి తెలంగాణకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పేలుడు పదార్థాలను మైన్స్, క్రషర్లు, క్వారీలకు అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైనట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

ఏడుగురు అరెస్ట్.. మరో ఇద్దరిపై దర్యాప్తు

ఈ కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎం.డి. వాహిద్, రవికుమార్ అనే మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి, వారి పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి సేకరించారు..? ఎవరికి సరఫరా చేయాలనుకున్నారు..? ఈ అక్రమ రవాణా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు. అక్రమంగా పేలుడు పదార్థాలను రవాణా చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం తీవ్రమైన నేరమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us