
Anthropic Researcher: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. ఇప్పటికే విద్య, వైద్యం, సాఫ్ట్వేర్, వ్యాపారం, మీడియా వంటి అనేక రంగాల్లో AI వినియోగం పెరుగుతోంది. ఎన్నో పనులను మనుషుల కంటే వేగంగా, తక్కువ సమయంలో పూర్తి చేస్తోంది. అయితే భవిష్యత్తులో ఇదే AI మనుషుల ఉద్యోగాలనే పూర్తిగా కనుమరుగు చేస్తుందా? ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరికీ ఉద్యోగాలు దొరకని పరిస్థితి వస్తుందా? తాజాగా ప్రముఖ AI సంస్థ Anthropicకు చెందిన పరిశోధకుడు చేసిన వ్యాఖ్యలు టెక్నాలజీ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.
అమెరికాకు చెందిన ప్రముఖ AI సంస్థ Anthropicలో AI భద్రతా విభాగంలో పనిచేస్తున్న పరిశోధకుడు టావో లిన్ భవిష్యత్తు గురించి కీలక అంచనా వేశారు. మరో 15 నెలల్లో లేదా 2027 చివరి నాటికి AI వ్యవస్థలు దాదాపు అన్ని రంగాల్లో అత్యుత్తమ మానవ నిపుణులతో సమానంగా లేదా అంతకంటే వేగంగా పని చేసే స్థాయికి వెళ్తుందని, దీని వల్ల ఉద్యోగాలపై ప్రభావం చూసే అవకాశం ఉందని అన్నారు. దీనినే ‘Broadly Superhuman AI’గా పేర్కొంటున్నారు. అంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్, సినిమాల నిర్మాణం, రాజకీయాలు సహా అనేక ప్రత్యేక రంగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన మనుషులను కూడా AI అధిగమించగలదన్నమాట.
AI అభివృద్ధి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో దాదాపు అందరూ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి రావచ్చని టావో లిన్ హెచ్చరించారు. చివరకు జీవనోపాధి కోసం ప్రభుత్వాల నుంచి అందించే సంక్షేమ పథకాలపైనే ఆధారపడాల్సి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. AI సామర్థ్యాలు పెరిగే కొద్దీ ప్రస్తుతం మనుషులు చేస్తున్న అనేక పనులను యంత్రాలు, సాఫ్ట్వేర్ వ్యవస్థలే నిర్వహించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే AI ఎంత వేగంగా అభివృద్ధి చెందినా.. వెంటనే అందరి ఉద్యోగాలు పోతాయని ఆయన చెప్పలేదు. AI ఒక పనిని చేయగలగడం వేరు, వాస్తవ ప్రపంచంలో ఆ పనిని పూర్తిగా యంత్రాలతో చేయించడం వేరు అని వివరించారు.
AI మనుషుల కంటే మెరుగ్గా పనిచేయగలిగినా.. అన్ని రంగాల్లో వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయడం సాధ్యం కాదని లిన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వ్యవసాయం, నిర్మాణ రంగం, తయారీ పరిశ్రమలు వంటి భౌతిక శ్రమ అవసరమయ్యే రంగాల్లో మనుషుల స్థానంలో రోబోలను తీసుకురావాలంటే భారీ సంఖ్యలో రోబోలను తయారు చేయాలి. వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పడుతుందని ఆయన వివరించారు.
ఈ అధ్యయనంలో ప్రోగ్రామర్లు 75 శాతం పనుల కవరేజ్‌తో, AI ప్రభావానికి అత్యంత ఎక్కువగా గురైన వృత్తులలో ఉన్నారని కూడా తేలింది. మరో మాటలో చెప్పాలంటే, మనుషులు జీతం తీసుకుని చేసే పనులను చేయడంలో AI మెరుగవుతున్నప్పటికీ, దానివల్ల రాత్రికి రాత్రే మొత్తం వృత్తులు కనుమరుగైపోవు.
AI వ్యవస్థలు అనేక జ్ఞానాత్మక, భౌతిక పనులలో మానవ పనితీరును అధిగమించే ఒక ఊహాజనిత దృశ్యాన్ని పరిశోధకులు పరిశీలించారు. ఈ వేగవంతమైన పురోగతిలో 2050 నాటికి అమెరికా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు సుమారు 62 శాతం నుండి 55 శాతానికి పడిపోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. ఆ తగ్గుదలలో దాదాపు సగం అంటే సుమారు 10 మిలియన్ల ఉద్యోగాలకు సమానమైనది.
మరోవైపు Anthropic నిర్వహించిన ఉద్యోగాలపై అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. AI ప్రభావం ఎక్కువగా ఉండే ఉద్యోగాల్లో 2022 చివరి నుంచి ఇప్పటివరకు నిరుద్యోగం గణనీయంగా పెరిగినట్లు ఆధారాలు లేవని పరిశోధకులు గుర్తించారు. అయితే AI ప్రభావం ఎక్కువగా ఉండే రంగాల్లో యువత నియామకాలు మందగించినట్లు కొన్ని సంకేతాలు కనిపించాయని తెలిపారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి