
ఫోన్ నంబర్ ముందు ఉండే +91 కేవలం రెండు అంకెల కలయిక కాదు. ప్రపంచ టెలిఫోన్ నెట్‌వర్క్‌లో భారత్‌కు ఉన్న ప్రత్యేక గుర్తింపు ఇది. అంతర్జాతీయ కాల్స్ సులభంగా సరైన దేశానికి చేరేందుకు ఏర్పాటైన వ్యవస్థలో భాగంగానే ఈ కోడ్ వచ్చింది. ఇందులో ‘+’ గుర్తుకు కూడా ప్రత్యేక అర్థం ఉంది. అసలు ఈ కోడ్ ఎలా వచ్చింది?
ప్రపంచవ్యాప్తంగా టెలిఫోన్ నెట్‌వర్క్‌లను సమన్వయం చేసేందుకు International Telecommunication Union (ITU) ప్రత్యేక ప్రమాణాలను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రపంచ దేశాలకు ప్రత్యేకమైన Country Codesను కేటాయిస్తుంది. ఇందులో భాగంగా భారతదేశానికి 91 కోడ్ లభించింది. ITU ప్రపంచాన్ని 9 ప్రధాన టెలికాం జోన్లుగా విభజించింది. దక్షిణ ఆసియా, మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా, మధ్యప్రాచ్య ప్రాంతాలు Zone 9 పరిధిలో ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతంలోని దేశాల కోడ్స్ సాధారణంగా ‘9’తో ప్రారంభమవుతాయి. భారత్‌కు +91, పాకిస్థాన్‌కు +92, ఆఫ్ఘనిస్థాన్‌కు +93, శ్రీలంకకు +94 కేటాయించారు.
1960వ దశకంలో అంతర్జాతీయ టెలిఫోన్ కోడ్స్ కేటాయించే సమయంలో దేశాల ప్రాధాన్యత, జనాభా, అంతర్జాతీయ కాల్స్ రాకపోకలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. భారత్ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన కీలక దేశంగా ఉండటంతో అంతర్జాతీయంగా సులభంగా డయల్ చేయడానికి తక్కువ అంకెల కోడ్ కేటాయించినట్లు సమాచారం. ఇక + గుర్తు International Directing Prefixను సూచిస్తుంది. విదేశాల నుంచి భారత్‌కు కాల్ చేసేటప్పుడు ఇది అంతర్జాతీయ నంబర్ ఫార్మాట్‌ను సూచించేందుకు ఉపయోగపడుతుంది. అందుకే +91 అనేది సాధారణ సంఖ్య కాదు.. ప్రపంచ టెలికాం వ్యవస్థలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు.