
సాధారణ ఫోన్ కిందపడితే స్క్రీన్ పగిలిపోవడం, బాడీ దెబ్బతినడం సాధారణమే. అయితే అలాంటి భయాలకు చెక్ పెట్టేలా ఐటెల్ కొత్త రగ్గడ్ ఫీచర్ ఫోన్‌ను తీసుకొచ్చింది. రైతులు, కార్మికులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ హ్యాండ్‌సెట్ తక్కువ ధరలోనే భారీ బ్యాటరీ, టార్చ్, ప్రత్యేక అగ్రి బటన్ వంటి సదుపాయాలను అందిస్తోంది.
రోజువారీ పనుల్లో ఫోన్ చేతి నుంచి జారిపడటం సాధారణమే. అలాంటి సందర్భాల్లో ఫోన్‌కు నష్టం జరగకుండా ఉండేందుకు ఐటెల్ ఈ రగ్గడ్ డివైజ్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. రెండు మీటర్ల ఎత్తు నుంచి కిందపడినా చెక్కుచెదరకుండా ఉండేలా దీని డిజైన్‌ను తీర్చిదిద్దినట్లు కంపెనీ పేర్కొంది. అదనంగా ఫ్రీ డస్ట్ అండ్ షాక్‌ప్రూఫ్ సిలికాన్ కవర్‌ను అందిస్తోంది.
ఈ ఫోన్‌లో 2000mAh భారీ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా రోజుల పాటు పనిచేసేలా దీన్ని రూపొందించారు. రాత్రి సమయాల్లో అత్యవసర పరిస్థితులకు ఉపయోగపడేలా పవర్‌ఫుల్ డ్యూయల్ ల్యాంప్ టార్చ్‌ను కూడా ఇందులో అందించారు. బయట ఎక్కువ సమయం పనిచేసే వారికి ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఉపయోగపడనుంది.
ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా ఇచ్చిన అగ్రి బటన్ మరో కీలక ఆకర్షణగా నిలుస్తోంది. ఒక్కసారి బటన్ నొక్కితే ప్రభుత్వ హెల్ప్‌లైన్‌లకు నేరుగా కనెక్ట్ అయ్యే సదుపాయం ఉంది. దీంతో రైతులకు అవసరమైన సమయంలో సంబంధిత ప్రభుత్వ సేవలను సులభంగా సంప్రదించే అవకాశం లభిస్తుంది.
తెలుగుతో సహా 10 భారతీయ భాషలకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఏడాది పాటు కౌంటర్ రీప్లేస్‌మెంట్ వారంటీ కూడా అందిస్తోంది. బ్లాక్, డీప్ బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్ ధర రూ. 1,499గా ఉంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మన్నిక కోరుకునే వారికి ఇది ఆసక్తికరమైన ఆప్షన్‌గా నిలవనుంది.