AI: మనిషిలా ఆలోచించే కంప్యూటర్‌ చిప్‌.. శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ

|

Sep 12, 2024 | 2:55 PM

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) శాస్త్రవేత్తలు ఈ చిప్‌ను తయారు చేశారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలను 'నేచర్' అనే ప్రసిద్ధ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ చిప్‌ను తయారు చేసిన శాస్త్రవేత్తల బృందానికి శ్రీతోష్ గోస్వామి నాయకత్వం వహించారు. ఈ బృందంలో నవకాంత్ భట్, దీపక్ శర్మ, శాంతి ప్రసాద్ రాత్, బిద్యభూషణ్ కుందు...

AI: మనిషిలా ఆలోచించే కంప్యూటర్‌ చిప్‌.. శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
AI Chip
Follow us on

ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతోంది. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారుతోంది. ఇక ఈ రంగంలో రోజురోజుకీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. సరికొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా తాజాగా భారత శాస్త్రవేత్తలు సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. అచ్చంగా మనిషి మెదడులా పనిచేసే ప్రత్యేక చిప్‌ను రూపొందించారు. ఈ చిప్ 16,500 మార్గాల్లో నిర్దిష్ట రకమైన ఫిల్మ్‌లో డేటాను నిల్వ చేయగలదు అలాగే ప్రాసెస్‌ చేయగలదు కూడా.

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) శాస్త్రవేత్తలు ఈ చిప్‌ను తయారు చేశారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలను ‘నేచర్’ అనే ప్రసిద్ధ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ చిప్‌ను తయారు చేసిన శాస్త్రవేత్తల బృందానికి శ్రీతోష్ గోస్వామి నాయకత్వం వహించారు. ఈ బృందంలో నవకాంత్ భట్, దీపక్ శర్మ, శాంతి ప్రసాద్ రాత్, బిద్యభూషణ్ కుందు, శ్రీబ్రత గోస్వామి ఉన్నారు. ఐఐఎస్‌సీకి చెందిన సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన వారు ఈ చిప్‌ను తయారు చేశారు. టెక్సాస్ అండ్‌ ఎమ్‌ యూనివర్సిటీ, యూనివర్శిటీ ఆఫ్ లిమెరిక్, ఐర్లాండ్ నుంచి శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్ మోడలింగ్‌లో సహాయం చేశారు.

ఈ కొత్త టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంప్యూటర్ల పనితీరును పూర్తిగా మార్చేయలదు. ‘న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్’గా ఈ టెక్నాలజీని పిలుస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంప్యూటర్లు కేవలం ప్రోగ్రామింగ్‌ ఆధారంగానే పని చేస్తున్నాయి. అయితే ఈ చిప్ మన మెదడు చేసినట్లే దాని చుట్టుపక్కల వాతావరణం నుంచి నేర్చుకోగలదు. శ్రీతోష్ గోస్వామి ఈ విషయమై మాట్లాడుతూ..’న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్ గత దశాబ్ద కాలంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ ఆవిష్కరణతో, మేము దాదాపుగా పరిపూర్ణమైన వ్యవస్థను సృష్టించాము’ అని చెప్పుకొచ్చారు.

ఈ ఆవిష్కరణ AI రంగంలో విప్లవానికి నాంది పలకనుంది. ఈ చిప్ మన మెదడు చేసినట్లే డేటాను నిల్వ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి అయాన్ల కదలికను ఉపయోగిస్తుంది. ఇది కంప్యూటర్ లాగా పనిచేసే ఒక రకమైన మాలిక్యులర్ డైరీ, ఇది తక్కువ శక్తిని వినియోగించుకుంటుంది, అలాగే తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఈ విషయమై ప్రొఫెసర్ నవకాంత్ భట్ మాట్లాడుతూ.. ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ సందర్భంలో, ఈ అభివృద్ధి పారిశ్రామిక, వినియోగదారు వ్యూహాత్మక అనువర్తనాలను విప్లవాత్మకంగా మార్చే ఒక గేమ్-ఛేంజర్‌గా మారనుంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచ స్థాయిలో నాయకత్వ పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహకారంతో, IISc బృందం ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ న్యూరోమార్ఫిక్ చిప్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది’ అని తెలిపారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..