Aditya L1: కాసేపట్లో నింగిలోకి దూసుకుపోనున్న ఆదిత్య.. ఇంతకీ ఈ మిషన్‌ అసలు లక్ష్యం ఏంటో తెలుసా?

|

Sep 02, 2023 | 7:07 AM

సుమారు 23 గంటలపాటు కౌంట్‌ డౌన్‌ ప్రక్రియ కొనసాగగా శనివారం (ఈరోజు) ఉదయం 11.50 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-57 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లనుంది. ప్రయోగం నేపథ్యంలో ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదిత్య ఎల్‌1 శాటిలైట్ ఆకృతిని తీసుకొని ఆలయానికి వెళ్లారు. ఇక ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ సైతం..

Aditya L1: కాసేపట్లో నింగిలోకి దూసుకుపోనున్న ఆదిత్య.. ఇంతకీ ఈ మిషన్‌ అసలు లక్ష్యం ఏంటో తెలుసా?
Aditya L1
Follow us on

చంద్రయాన్‌ 3 రూపంలో ప్రపంచంలో ఏ దేశం చేయలేని ఖగోళ స్వప్నాన్ని నిజం చేసిన ఇస్రో ఇప్పుడు తాజాగా మరో అద్భుతానికి శ్రీకారం చుట్టింది. మొన్న జాబిల్లిపై రహస్యాలను తెలుసుకునేందుకు చంద్రయాన్‌ 3ని ప్రయోగించగా ఇప్పుడు సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదిత్య ఎల్‌1 ప్రయోగం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మిషన్‌కు సంబంధించి కౌంట్‌డౌన్‌ కూడా ప్రారంభమైంది. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు.

సుమారు 23 గంటలపాటు కౌంట్‌ డౌన్‌ ప్రక్రియ కొనసాగగా శనివారం (ఈరోజు) ఉదయం 11.50 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-57 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లనుంది. ప్రయోగం నేపథ్యంలో ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదిత్య ఎల్‌1 శాటిలైట్ ఆకృతిని తీసుకొని ఆలయానికి వెళ్లారు. ఇక ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ సైతం.. ఎన్నో ఏళ్లుగా ఆనవాయితిగా వస్తున్న చెంగల్మ పరమేశ్వరీ ఆలయాన్ని దర్శించుకున్నారు. సూర్యుడిపై ఉన్న వాతావరణాన్ని పరిశోధించడమే లక్ష్యంగా ఇస్రో ఆదిత్య ఎల్‌1 ప్రయోగాన్ని చేపడుతోంది. కరోనాగ్రఫీ పరికరంతో సౌర వాతావరణాన్ని పరిశోధించనున్నారు.

ఇస్రో ట్వీట్‌..

ఇదిలా ఉంటే చంద్రయాన్‌ 3 మాదిరిగానే ఆదిత్య ఎల్‌1 కూడా సూర్యూడిపై ల్యాండ్‌ అవుతుందని కొందరు భావిస్తున్నారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు, నిజానికి ఇది అసాధ్యం కూడా. ఈ విషయమై ఇస్రో ఆదిత్య ఎల్‌1 ప్రయోగానికి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆదిత్య ఎల్‌1 సూర్యుడిపై ల్యాండ్‌ అవ్వడం అనేది ఉండదని ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. ఈ ఉపగ్రహం భూమి నుంచి 1.5 మిలియన్ కి. మీ దూరంలో ఉండి, పరిశోధనలు సాగిస్తుందని పేర్కొంది.
ఇది సూర్యుడు-భూమి మధ్య ఉన్న దూరంలో 1% అని తెలిపింది. సూర్యుడు భారీ వాయుగోళం అని, దాని బాహ్య వాతావరణాన్ని ఆదిత్య-L1 అధ్యయనం చేస్తుందని వివరించింది. ఈ శాటిలైట్ సూర్యుడిపై ల్యాండ్ కాదని, సూర్యుడి దగ్గరకు కూడా వెళ్లదని స్పష్టం చేసింది.

ఆదిత్య ఎల్‌1 ప్రత్యేకతలు ఇవే..

* సూర్యుడిపై ప్రయోగాలు చేసేందుకు ఇస్రో చేపడుతోన్న తొలి మిషన్‌ ఇదే.

* ఇందులోని శాటిలైట్‌ బరువు సుమారు 1500 కిలోలు ఉంటుంది.

* భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్‌ పాయింట్‌1 చుట్టూ ఉన్న కక్ష్యలో ఈ శాటిలైట్‌ను ప్రవేశపెడతారు.

* ఇందులో మొత్తం ఏడు పేలోడ్లను ఏర్పాటు చేశారు. వీటి సహాయంతో సూర్యుడిలోని ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తారు.