రోజురోజుకీ సమాజంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రజల అమాయకత్వాన్ని, అత్యాశను పెట్టుబడిగా మార్చుకొని లక్షలు కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు. ఎక్కడో కూర్చొని మన ఖాతాలో డబ్బులును కాజేస్తున్నారు. అయితే ఈ మాయగాళ్ల చేతిలో కేవలం చదువు కోని వారు మాత్రమే మోసపోతున్నారనుకుంటే పొరపాటే.. విద్యావంతులైన డాక్టర్లు, ఇంజనీర్లు సైతం డబ్బులు కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటన ముంబయిలో చోటు చేసుకుంది. ఆన్‌లైన్‌లో రూ. 300 లిప్‌స్టిక్ బుక్ చేసిన ఓ డాక్టర్ ఏకంగా రూ. లక్ష కోల్పోయింది. ఇంతకీ ఈ మోసం ఎలా జరిగిందంటే..
నవి ముంబయికి చెందిన ఓ వైద్యురాలు నవంబర్ 2 తేదీన ఆన్‌లైన్‌లో రూ. 300 విలువైన లిప్‌స్టిక్‌ను ఆర్డర్ చేసింది. ఇదే సమయంలో ఆమెకు ఫోన్‌కు ఆర్డర్ డెలివరి అయినట్లు మెసేజ్ వచ్చింది. నిజానికి అప్పటి ఇంకా డెలివరీ కాలేదు. దీంతో సదరు వైద్యురాలు వెంటనే ఈ విషయాన్ని కొరియర్ కంపెనీకి తెలపగా, త్వరలోనే కస్టమర్ కేర్ నుంచి మీకు ఫోన్ వస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేసి.. ఆర్డర్ హోల్డ్‌లోకి వెళ్లిందని ప్రాసెస్ పూర్తి చేయాలంటే.. అకౌంట్ వెరిఫికేషన్ కోసం రూ. 2 పేమెంట్ చేయాలని కోరారు.
ఓ వెబ్ లింక్‌ను ఫోన్‌కు పంపించి, అందులో బ్యాంక్ వివరాలు ఎంటర్ చేయించారు. రెండు రూపాయలకే కదా అని వెనకా ముందు ఆలోచించకుండా లింక్‌ను క్లిక్ చేసింది. దీంతో వెంటనే బాధితురాలి స్మార్ట్ ఫోన్‌లో ఓ ఆప్లికేషన్ డౌన్‌లోడ్ అయ్యింది. వెంటనే రూ. 2 పేమెంట్ కూడా జరిగింది. ఇక నవంబర్ 9వ తేదీన సదరు వైద్యురాలి ఖాతా నుంచి ఒకసారి రూ. 95 వేలు, మరోసారి రూ. 5 వేలు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను మోసపోయినట్లు గుర్తించింది.
సైబర్ నేరస్థులు ఈ మోసంలో భాగంగా ఫిషింగ్ మెసేజ్‌ను పంపించారు. కొరియర్ కంపెనీ పేరుతో పంపిన ఈ ఫేక్ మెసేజ్‌ను గుడ్డిగా నమ్మిన బాధితురాలు వెంటనే లింక్‌ను క్లిక్ చేసింది. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అనుమానస్పదంగా ఉన్న మెసేజ్‌లకు ఎట్టి పరిస్థితుల్లో స్పందించకూడదని చెబుతున్నారు. కొరియర్ కంపెనీలు ఎప్పుడూ మీ బ్యాంక్‌లకు సంబంధించిన వివరాలను అడగవని, పొరపాటున కూడా ఆ విషయాలు వెల్లడించాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి…