
పెట్రోల్ ఖర్చులకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావిస్తున్న వారికి BGauss కొత్త మోడల్ ఆసక్తికరమైన ఎంపికగా మారనుంది. ఫ్యామిలీ రైడింగ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ స్కూటర్‌లో 178 కిలోమీటర్ల IDC రేంజ్ ఉంది. 75kmph గరిష్ట వేగంతో పాటు స్మార్ట్ ఫీచర్లు, భద్రతా సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
BGauss తాజాగా భారత మార్కెట్లో C12 MaxR ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. దీని ధరను రూ.1.46 లక్షలుగా నిర్ణయించారు. కంపెనీ ప్రత్యేకంగా రూపొందించిన WSA ప్లాట్‌ఫామ్‌పై ఈ స్కూటర్‌ను తయారు చేశారు. బలమైన స్టీల్ నిర్మాణంతో రూపొందించిన ఈ మోడల్ సుమారు 1.5 లక్షల కిలోమీటర్ల వరకు మన్నేలా అభివృద్ధి చేసినట్లు కంపెనీ వెల్లడించింది.
డిజైన్ విషయానికి వస్తే సాధారణ ఫ్యామిలీ స్కూటర్ తరహాలో కనిపిస్తుంది. ముందు భాగంలో ప్రొజెక్టర్ LED హెడ్‌లైట్లు, పెద్ద ఫ్లోర్‌బోర్డ్, వెడల్పాటి మిర్రర్లు ఉన్నాయి. Sparkling Wine Plus Champagne Gold, Terra Green Plus Champagne Gold, Pearl White Plus Satin Black రంగుల్లో ఇది లభిస్తుంది.
పవర్ కోసం 3.8 kWh LFP బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. దీనికి 4.2 kW సైడ్-మౌంటెడ్ మోటార్‌ను జత చేశారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 178 కిలోమీటర్ల IDC రేంజ్ అందిస్తుంది. గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. Eco, Ride, Sport అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. 750W ఛార్జర్ కూడా లభిస్తుంది.
కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని C12 MaxRలో పెద్ద సీటు కింద స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. చిన్న వస్తువుల కోసం నాలుగు ప్రత్యేక పాకెట్లు, బూట్ ల్యాంప్ కూడా ఉన్నాయి. టెక్నాలజీ పరంగా 5-అంగుళాల TFT కన్సోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రివర్స్ స్విచ్, క్రూయిజ్ మోడ్, USB Type-C ఛార్జింగ్ పోర్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
భద్రత కోసం Parent Lock, SOS, Fall Sense, Vehicle Diagnostics వంటి ఫీచర్లు అందించారు. భారతీయ రోడ్లను దృష్టిలో పెట్టుకుని 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు, 160 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. బ్రేకింగ్ కోసం ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లను అమర్చారు. సస్పెన్షన్ బాధ్యతలను టెలిస్కోపిక్ ఫోర్క్, 5-స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ ఆఫ్‌సెట్ సస్పెన్షన్ నిర్వహిస్తాయి.