Paris Olympics: పారిస్‌ ఒలింపిక్స్‌లో తొలి రోజు భారత్ అథ్లెట్ల ప్రదర్శన ఇలా…

|

Jul 28, 2024 | 10:08 AM

పారిస్‌ ఒలింపిక్స్‌లో మనోళ్లు దూసుకెళ్తున్నారు. తొలిరోజు పలు విజయాలు నమోదు చేశారు భారత అథ్లెట్లు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌లో మను బకర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో ఆమె 580 పాయింట్లు సాధించి.. మూడో స్థానంలో నిలిచింది.

Paris Olympics: పారిస్‌ ఒలింపిక్స్‌లో తొలి రోజు భారత్ అథ్లెట్ల ప్రదర్శన ఇలా...
Lakshya Sen - shooter Manu Bhaker
Follow us on

1. షూటింగ్‌ మెరుపులు
—————
మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌లో మను బకర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో ఆమె 580 పాయింట్లు సాధించింది మూడో స్థానంలో నిలిచింది. ఇక 27 పర్ఫెక్ట్‌ స్కోర్స్‌తో అందరికన్నా టాప్‌లో నిలిచింది మను బకర్‌. ఈరోజు జరిగే ఫైనల్స్‌లో నెగ్గితే ఆమె మెడల్‌ సాధిస్తుంది. మధ్యాహ్నం 3.30కి ఫైనల్‌ రౌండ్‌ జరగనుంది.

2. ప్రీతి శుభారంభం
—————–
ఇక మహిళల బాక్సింగ్‌ 54కేజీల విభాగంలో ప్రీతీ పవార్‌ శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో వియత్నాం ప్లేయర్‌ను మట్టికరిపించింది. 5-0తేడాతో విజయం సాధించింది ప్రీతీ పవార్‌. రౌండ్‌ ఆఫ్‌ 16కి చేరుకున్న ప్రీతి.. ఈనెల 31న కొలంబియా క్రీడాకారిణితో తలపడనుంది. అక్కడ నెగ్గితే క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంటుంది.

3. దుమ్మురేపారు
————–
హాకీలో భారత పురుషుల జట్టు దుమ్మురేపింది. న్యూజిలాండ్‌తో జరిగిన పూల్‌ మ్యాచ్‌లో 3-2తో విజయం సాధించింది. హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలోని భారత జట్టు అద్భుతంగా ఆడింది. కివీస్‌ గట్టి పోటీ ఇచ్చినా.. మనోళ్లు పైచేయి సాధించారు. రేపు అర్జంటీనాతో తలపడనుంది భారత జట్టు.

4. సూపర్‌ సేన్‌
————–
బ్యాడ్మింటన్‌లో లక్ష్య సేన్‌ మెరిశాడు. మెన్స్‌ సింగిల్స్‌ తొలి రౌండ్‌లో అద్భుత విజయం సాధించాడు. 21-8, 22-20 తేడాతో గ్వతెమల ప్లేయర్‌ కెవిన్‌ కోర్డోన్‌పై విజయం సాధించాడు. రేపు బెల్జియం ప్లేయర్‌ జులియన్‌ క్రాగీతో గ్రూప్‌ మ్యాచ్‌లో తలపడబోతున్నాడు లక్ష్యసేన్‌.

5. కుర్రాళ్లు మెరిశారు
—————
బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌లోనూ మన కుర్రాళ్లు అదరగొట్టారు. సాత్విక్‌, చిరాగ్‌ ప్రత్యర్థులను చిత్తుగా ఓడించారు. గ్రూప్‌ స్టేజ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన రోనన్ లాబర్‌, లూకాస్‌ కార్వీలను 21-17, 21-14తో ఓడించారు. రేపు జర్మనీకి చెందిన మార్క్‌ లామ్స్‌ఫస్‌, మార్విన్‌ సిడెల్‌తో తలపడనున్నారు సాత్విక్‌, చిరాగ్‌.

6. బాహు బల్‌రాజ్‌
————–
ఇక పురుషుల రోయింగ్‌లో బల్‌రాజ్‌ పన్వర్‌ రెప్‌చేజ్‌ రౌండ్‌కు క్వాలిఫై అయ్యాడు. నిన్న జరిగిన మెన్స్‌ సింగిల్స్‌ స్కల్స్‌ హీట్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు రెప్‌చేజ్‌ రౌండ్‌ జరగనుంది. హీట్స్‌లో 7నిమిషాల, 7 సెకన్లలో గమ్యస్థానానికి చేరుకున్నాడు బల్‌రాజ్‌. రెప్‌చేజ్‌లో మరింత వేగంతో దూసుకుపోతానన్నాడు.

7. టేబుల్‌ టాప్‌
————
టేబుల్‌ టెన్నిస్‌లో మన కుర్రాడు హర్మీత్‌ దేశాయ్‌ మరిశాడు. జోర్డాన్‌కు చెందిన జైద్‌ అబో యమన్‌పై 11-7, 11-9, 11-5, 11-5 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. రౌండ్‌ ఆఫ్‌ 64కు చేరుకున్న హర్మీత్‌.. ఈరోజు ఫ్రాన్స్‌ ప్లేయర్‌ ఫెలిక్స్‌తో తలపడనున్నాడు.

8. సింధు గేమ్‌
————
ఈరోజు భారత అథ్లెట్లు పలు పోటీల్లో తలపడనున్నారు. మధ్యాహ్నం 12.50కి పీవీ సింధు మ్యాచ్‌ ఉంది. మాల్దీవులకు చెందిన ఫాతిమాతో ఆమె తలపడుతుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు వెండి పతకం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సింధు కాంస్య పతకం సాధించింది.

9. నిఖత్‌ ఫస్ట్‌ పంచ్‌
————
సాయంత్రం 4 గంటలకు బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ తొలి రౌండ్‌ ఆడనుంది. టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయి శ్రీజ ఆకుల, మానిక బాత్రా, పురుషుల సింగిల్స్‌లో ఆచంట శరత్‌ కమల్‌, హర్మీత్‌ దేశాయ్‌ తొలి రౌండ్‌ ఆడనున్నారు.

స్విమ్మింగ్‌ పోటీల్లో ఈరోజు శ్రీహరి నటరాజ్‌, ధీనిధి దేసింఘు తమ ప్రతిభను చాటనున్నారు. బ్యాడ్మింటన్‌ పురుషుల్లో ప్రణయ్‌ తొలిరౌండ్‌ ఆడనున్నాడు. ఆర్చరీలో మన రెండు జట్లు సత్తా చాటనున్నారు. 10మీటర్ల ఎయిర్‌రైఫిల్‌, మహిళలు, పురుషుల క్వాలిఫికేషన్‌ రౌండ్స్‌ ఉన్నాయి. టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో సుమిత్‌ నాగల్‌, పురుషుల డబుల్స్‌లో బోపన్న, బాలాజీ జోడీ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..