వద్దని బీసీసీఐ ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. 400 వికెట్లతో ఇచ్చిపడేశాడుగా.. తొలి భారత బౌలర్‌గా అరుదైన రికార్డ్..!

Yuzvendra Chahal 400 T20 Wickets: భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. 400 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. తమిళనాడుతో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో అమిత్ సాత్విక్‌ను ఔట్ చేసి ఈ అరుదైన ఘనత అందుకున్నాడు.

వద్దని బీసీసీఐ ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. 400 వికెట్లతో ఇచ్చిపడేశాడుగా.. తొలి భారత బౌలర్‌గా అరుదైన రికార్డ్..!
Yuzvendra Chahal

Updated on: Nov 19, 2026 | 6:00 AM

Yuzvendra Chahal 400 T20 Wickets: భారత స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో 400 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026-27లో భాగంగా తమిళనాడుతో జరిగిన ఎలైట్ గ్రూప్-బి మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇండోర్‌లోని డేలీ కాలేజ్ గ్రౌండ్‌లో బుధవారం (నవంబర్ 18) జరిగిన ఈ మ్యాచ్‌లో తమిళనాడు బ్యాటర్ అమిత్ సాత్విక్‌ను బౌల్డ్ చేసి చాహల్ తన 400వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

అమిత్ సాత్విక్ వికెట్‌తో చరిత్ర..

ఈ మ్యాచ్‌లో హర్యానా కెప్టెన్ అంకిత్ కుమార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తమిళనాడు 5.3 ఓవర్లకు 54/2 స్కోరుతో ఉన్న సమయంలో చాహల్ బౌలింగ్‌కు వచ్చాడు. అప్పటికే దూకుడుగా ఆడుతున్న అమిత్ సాత్విక్ 17 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. చాహల్ వేసిన బంతికి సాత్విక్ బౌల్డ్ కావడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసింది. అదే సమయంలో చాహల్ టీ20 కెరీర్‌లో 400 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.

ఎక్కువమంది చదివినది: IPL 2027 Retention: రిటెన్షన్ తర్వాత మారిన లెక్కలు.. పవర్ ఫుల్ టీం, వరస్ట్ టీంలు ఏవో తెలుసా..?

ఇవి కూడా చదవండి

396 వికెట్లతో టోర్నీలోకి.. 400తో చరిత్రలోకి!

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026-27 ప్రారంభానికి ముందు చాహల్ ఖాతాలో 396 టీ20 వికెట్లు ఉన్నాయి. నవంబర్ 13న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్లు తీయలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో 27 పరుగులు ఇచ్చాడు. నవంబర్ 16న సౌరాష్ట్రతో జరిగిన పోరులో మూడు వికెట్లు పడగొట్టి తన ఖాతాను 399కు చేర్చాడు. తమిళనాడుతో మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీస్తే 400 వికెట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉండగా.. అమిత్ సాత్విక్‌ను ఔట్ చేసి ఆ ఘనతను అందుకున్నాడు.

టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు..

టీ20 క్రికెట్‌లో భారత బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో చాహల్ అగ్రస్థానంలో నిలిచాడు.

బౌలర్ మ్యాచ్‌లు వికెట్లు
యుజ్వేంద్ర చాహల్ 346 400
భువనేశ్వర్ కుమార్ 339 366
జస్ప్రీత్ బుమ్రా 288 354
పియూష్ చావ్లా 307 329
రవిచంద్రన్ అశ్విన్ 343 323
అక్షర్ పటేల్ 345 300

చాహల్ 400 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. భువనేశ్వర్ కుమార్ 366 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. బుమ్రా 354 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఎక్కువమంది చదివినది: Video: 13 సిక్సర్లు, 8 ఫోర్లతో ఊహించని విధ్వంసం.. 281 స్ట్రైక్‌రేట్‌తో కోహ్లీ దోస్త్ రికార్డుల మోత..!

ఐపీఎల్‌లోనూ చాహల్‌దే రికార్డు..

చాహల్ తన 15 ఏళ్ల టీ20 కెరీర్‌లో అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌తో పాటు దేశవాళీ, విదేశీ టోర్నీల్లో వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున 2016 నుంచి 2023 మధ్య 80 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 96 వికెట్లు సాధించాడు. 25.09 సగటుతో, 8.19 ఎకానమీతో బౌలింగ్ చేశాడు.

ఐపీఎల్‌లో నాలుగు ఫ్రాంచైజీల తరఫున 188 మ్యాచ్‌లు ఆడి 233 వికెట్లు తీశాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చాహల్ కొనసాగుతున్నాడు.

– ముంబై ఇండియన్స్: 2013లో ఒక మ్యాచ్ ఆడి వికెట్ తీయలేదు.

– రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 2014 నుంచి 2021 వరకు 139 వికెట్లు.

– రాజస్థాన్ రాయల్స్: 2022 నుంచి 2024 మధ్య 66 వికెట్లు.

– పంజాబ్ కింగ్స్: 2025, 2026 సీజన్లలో 28 వికెట్లు.

దేశవాళీ, ఇతర టీ20 టోర్నీల్లో మరో 71 వికెట్లు సాధించాడు. ఇందులో 2011 ఛాంపియన్స్ లీగ్ టీ20లో ముంబై ఇండియన్స్ తరఫున, ఇంగ్లండ్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున వైటాలిటీ బ్లాస్ట్‌లో ఆడిన మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. 400 వికెట్ల మైలురాయితో చాహల్ భారత టీ20 క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us