IND vs ZIM : చెపాక్ మైదానంలో మ్యాచ్ కోసం అమెరికా నుంచి కెమికల్.. జింబాబ్వేతో భారత్ చావోరేవో పోరు

IND vs ZIM : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్, జింబాబ్వే జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ అత్యంత కీలకంగా మారింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.

IND vs ZIM : చెపాక్ మైదానంలో మ్యాచ్ కోసం అమెరికా నుంచి కెమికల్.. జింబాబ్వేతో భారత్ చావోరేవో పోరు
Team India

Updated on: Feb 26, 2026 | 1:13 PM

IND vs ZIM : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్, జింబాబ్వే జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ అత్యంత కీలకంగా మారింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అయితే ఈ పోరుకు కేవలం ప్రత్యర్థి జట్టు మాత్రమే కాదు, ప్రకృతి కూడా ఒక సవాలుగా నిలిచింది. అదే మంచు ప్రభావం. రాత్రి వేళల్లో చెన్నైలో కురిసే మంచు కారణంగా బౌలర్లు బంతిపై పట్టు కోల్పోయే అవకాశం ఉంది. దీనిని అడ్డుకోవడానికి స్టేడియం యాజమాన్యం ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

చెపాక్ స్టేడియంలో మంచు ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన డ్యూ క్యూర్ అనే కెమికల్‌ను గ్రౌండ్‌లో స్ప్రే చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి జరుగుతుంది కాబట్టి, రెండో ఇన్నింగ్స్ సమయంలో మైదానం మొత్తం తడిగా మారి బ్యాటర్లకు అనుకూలంగా మారుతుంది. దీనివల్ల టాస్ గెలిచిన జట్టుకు అనవసరమైన అడ్వాంటేజ్ లభించకూడదనే ఉద్దేశంతో మంగళ, బుధవారాల్లోనే ఈ కెమికల్‌ను చల్లారు. నేడు (గురువారం) మధ్యాహ్నం కూడా మరోసారి దీనిని స్ప్రే చేయనున్నారు.

సాధారణంగా చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కానీ మంచు కురిస్తే బంతి జారిపోతూ బ్యాట్‌పైకి వేగంగా వస్తుంది. అప్పుడు స్పిన్నర్ల మాయాజాలం పారదు. వాతావరణ నివేదికల ప్రకారం మ్యాచ్ సమయంలో హ్యుమిడిటీ (తేమ) 80 నుంచి 90 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. ఈ డ్యూ క్యూర్ కెమికల్ వాడటం వల్ల గడ్డిపై మంచు బిందువులు ఏర్పడకుండా నిరోధించవచ్చు. తద్వారా మ్యాచ్ ఆద్యంతం బౌలర్లకు, బ్యాటర్లకు సమాన అవకాశాలు ఉంటాయని క్యూరేటర్లు భావిస్తున్నారు.

దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్‌కు, ఈ మ్యాచ్‌లో గెలుపు అనివార్యం. జింబాబ్వే కూడా వెస్టిండీస్ చేతిలో 107 పరుగుల భారీ ఓటమిని మూటగట్టుకుని కసితో ఉంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా, ఈ టెక్నాలజీ సాయంతో మంచును జయించి జింబాబ్వేపై ఘనవిజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. టాస్ గెలిచిన కెప్టెన్ ఇక్కడ ఛేజింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉన్నప్పటికీ, కెమికల్ ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us