SA vs ZIM: వరుసగా 7వ విజయం.. కట్‌చేస్తే.. సెమీ‌స్‌లో న్యూజిలాండ్‌ను ఢీ కొట్టనున్న సౌతాఫ్రికా

South Africa semifinal vs New Zealand: సౌతాఫ్రికా జట్టు వరుసగా 7వ విజయంతో టీ20 ప్రపంచకప్ 2026లో ఆధిపత్యం కొనసాగిస్తోంది. తాజాగా జింబాబ్వే జట్టుపై విజయంతో గ్రాండ్‌గా సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. ఇప్పటి వరకు ఓటమి లేని సౌతాఫ్రికా సెమీస్‌లో గెలిచి, ఫైనల్ దిశగా సాగుతుందా లేదా అనేది చూడాలి.

SA vs ZIM: వరుసగా 7వ విజయం.. కట్‌చేస్తే.. సెమీ‌స్‌లో న్యూజిలాండ్‌ను ఢీ కొట్టనున్న సౌతాఫ్రికా
Sa Vs Zim

Updated on: Mar 01, 2026 | 7:44 PM

South Africa semifinal vs New Zealand: టీ20 వరల్డ్ కప్ 2026లో దక్షిణాఫ్రికా విజయాలు ఆగే సూచనలు కనిపించడం లేదు. గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లు గెలిచిన ఐడెన్ మార్క్రం సారథ్యంలోని ప్రోటీస్ జట్టు, సూపర్-8 రౌండ్‌లో కూడా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా, చివరి సూపర్-8 మ్యాచ్‌లో జింబాబ్వేను 5 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా 7వ విజయాన్ని నమోదు చేసింది. దీంతో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా న్యూజిలాండ్‌ను ఎదుర్కొననుంది.

జింబాబ్వే పోరాటం.. రజా ఒంటరి యోధుడు..

మార్చి 1న ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 154 పరుగులకే పరిమితమైంది. జింబాబ్వే బ్యాటింగ్ ప్రారంభం నుంచే ఒత్తిడిలో పడింది. కెప్టెన్ సికందర్ రజా మాత్రమే ఒక వైపు నిలబడి 43 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టును గౌరవప్రద స్కోర్‌కి చేర్చాడు. దక్షిణాఫ్రికా తరపున యువ ఫాస్ట్ బౌలర్ క్వేనా మఫాకా 4 ఓవర్లలో 21 పరుగులకే 2 వికెట్లు తీసి మెప్పించాడు.

రజా దెబ్బకు తడబడిన సౌత్ ఆఫ్రికా..

ఛేజ్‌లో దక్షిణాఫ్రికా కూడా మొదట్లో కష్టాల్లో పడింది. సికందర్ రజా తొలి, మూడో ఓవర్లలో ఓపెనర్లు ఐడెన్ మార్క్రం, క్వింటన్ డికాక్‌లను ఔట్ చేశాడు.

అయితే రియాన్ రికెల్టన్, డేవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్ వేగంగా పరుగులు చేసి ఒత్తిడిని తగ్గించారు. 101 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయినా లక్ష్యం పెద్దది కాకపోవడంతో ట్రిస్టన్ స్టబ్బ్స్, జార్జ్ లిండే జట్టును 17.5 ఓవర్లలోనే విజయానికి చేర్చారు.

100% విజయం రికార్డు కొనసాగింపు..

ఈ విజయంతో దక్షిణాఫ్రికా టోర్నీలో తమ 100% విజయ రికార్డును కొనసాగించింది. మరోవైపు, గ్రూప్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకలను ఓడించిన జింబాబ్వే సూపర్-8లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది.

సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్ పోరు మరింత ఉత్కంఠ రేపనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us