ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) ఏలుతుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతటి సంపద అంతటి ఘన కీర్తి బీసీసీఐ సొంతం చేసుకుంది. ప్రపంచంలో ఏ క్రికెట్ బోర్డుకు సాధ్యం కానిది బీసీసీఐకి మాత్రమే సాధ్యమైంది. ఇందుకు భారత్ క్రికెట్ జట్టు ప్రదర్శన ఒక కారణమైతే బీసీసీఐలో ఉన్న సభ్యులు మరో కారణంగా చెప్పొచ్చు. గత కొద్ది సంవత్సరాలుగా బీసీసీఐ ఆటలపరంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ప్లేయర్ల కాంట్రాక్టు విషయాల నుంచి మొదలుపెట్టి మహిళా క్రికెట్ అభ్యున్నతికి సైతం బీసీసీఐ ఎంతో తోడ్పడింది. కేవలం భారత్ క్రికెట్ జట్టునే కాకుండా ఆపదలో ఉన్న సమయంలో శ్రీలంక, అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డులను సైతం బీసీసీఐ ఆదుకున్న సంగతి తెలిసిందే.
ఇంత చేసిన బీసీసీఐపై క్రికెట్ అభిమానులు ఓ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియాల అభివృద్ధిపై బీసీసీఐ ఫోకస్ చేయడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో ఉన్న స్టేడియంలో పరిస్థితి కొన్ని చోట్ల మెరుగుపడినా.. మరికొన్ని చోట్ల దారుణ పరిస్థితులు ఉన్నాయి. స్టేడియంలో అభివృద్ధి కోసం ఆయా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లకు బీసీసీఐ నుంచి నిధులు వెళుతున్న ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. తాజాగా భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచే దీనికి ఉదాహరణ. ఆదివారం రోజు ఎలాంటి వర్షం కురవకపోయినా మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి బీసీసీఐకి ఎదురైంది. అక్కడక్కడ మైదానంలోని పరిస్థితి ఆటకు అనుకూలించలేదంటూ ఒకరోజు మొత్తం ఆటను రద్దు చేశారు. గ్రీన్ పార్క్ స్టేడియం అభివృద్ధికి నోచుకోలేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. చాలా సందర్భాల్లో వర్షాలు పడిన కొద్ది గంటల్లోనే మ్యాచులు ప్రారంభమయ్యే టెక్నాలజీని బీసీసీఐ ఎందుకు అమలు చేయలేకపోతుందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఉదాహరణలుగా తీసుకొని బీసీసీఐ స్టేడియంలో అభివృద్ధి చేయాల్సిందిగా క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఎంత పెద్ద వర్షం కురిసిన సరే కేవలం నిమిషాల వ్యవధిలోనే మ్యాచ్‌కు సిద్ధమైపోయే విధంగా తయారు చేశారు. స్టేడియానికి ఎయిర్ సిస్టం ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీని ఉపయోగించి వీటిని తయారు చేశారు. బీసీసీఐ దగ్గర ఉన్న నిధులతో అన్ని స్టేడియాల్లో ఇలాంటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.