
RR Retained Players: ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక స్థానం రాజస్థాన్ రాయల్స్‌ది. తొలి సీజన్‌లో షేన్ వార్న్ సారథ్యంలో కప్పు గెలిచిన రాయల్స్.. ఆ తర్వాత 17 ఏళ్లుగా మళ్లీ ఫైనల్ మెట్టు కూడా దాటలేకపోయింది. గత సీజన్లలో యువ ఆటగాళ్లపై పెట్టుబడి పెట్టినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రకటించిన రిటెన్షన్ జాబితా చూస్తే.. ఈసారి యాజమాన్యం సెంటిమెంట్ కంటే వ్యూహానికే ప్రాధాన్యమిచ్చిందని స్పష్టమవుతోంది.
ఈ రిటెన్షన్‌లో అతిపెద్ద హెడ్‌లైన్.. మొహమ్మద్ షమీ రాక. లక్నో సూపర్ జెయింట్స్ రూ.10 కోట్లకు కొన్న షమీని రాజస్థాన్ రూ.8 కోట్ల రివైజ్డ్ ఫీజుతో ట్రేడ్ ద్వారా తన గూటికి తెచ్చుకుంది. అతడితో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎం. సిద్ధార్థ్ కూడా లక్నో నుంచి రాజస్థాన్‌కు (రూ.75 లక్షలు) మారాడు. దీనికి బదులుగా బ్రైడన్ కరన్ (రూ.2.4 కోట్లు) రాజస్థాన్ నుంచి లక్నోకు వెళ్లాడు.
క్రికెట్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఒకటే.. జోఫ్రా ఆర్చర్ + మొహమ్మద్ షమీ.. ఈ కాంబినేషన్ ప్రత్యర్థులకు పీడకలే. గాయం నుంచి కోలుకుని షమీ మళ్లీ రిథమ్ అందుకుంటే రాజస్థాన్ పేస్ దళం లీగ్‌లోనే అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. సందీప్ శర్మ అనుభవం, నాండ్రే బర్గర్ పేస్ తోడైతే ఆ జట్టును ఢీకొట్టడం అంత సులభం కాదు.
రిటెన్షన్‌లో సంచలన నిర్ణయం.. షిమ్రాన్ హెట్‌మయర్ రిలీజ్. ఫినిషర్‌గా ఎన్నో మ్యాచ్‌లు గెలిపించిన కరేబియన్ హిట్టర్‌ను వదలడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే గత రెండు సీజన్లుగా అతడి స్ట్రైక్‌రేట్ తగ్గడం, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, శుభమ్ దూబే రూపంలో భారత ఫినిషర్లు సిద్ధంగా ఉండటంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో రవీంద్ర జడేజాను అట్టిపెట్టుకోవడం రాజస్థాన్‌కు పెద్ద ప్లస్. చెన్నై నుంచి వచ్చిన తర్వాత జడేజా జట్టుకు వెన్నెముకగా మారాడు. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్.. ఈ భారత కోర్‌ను యాజమాన్యం చెక్కుచెదరనివ్వలేదు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మరోసారి నమ్మకం ఉంచడం హర్షణీయం.
భారీ ధర పలికినా రాణించలేకపోయిన తుషార్ దేశ్‌పాండే (రూ.6.5 కోట్లు), ఆడమ్ మిల్నే (రూ.2.4 కోట్లు), క్వెనా మఫాకా (రూ.1.5 కోట్లు)లను విడిచిపెట్టి పర్స్‌ను కాపాడుకుంది.
అమన్ రావు పెరాల, బ్రిజేష్ శర్మ, దసున్ షనక, ధ్రువ్ జురెల్, డొనోవన్ ఫెరీరా, జోఫ్రా ఆర్చర్, లువాన్-డ్రే ప్రిటోరియస్, మణిమారన్ సిద్ధార్థ్ (ట్రేడ్), మొహమ్మద్ షమీ (ట్రేడ్), నాండ్రే బర్గర్, రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజా, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, శుభమ్ దూబే, సుశాంత్ మిశ్రా, వైభవ్ సూర్యవంశీ, యష్ రాజ్ పుంజా, యశస్వి జైస్వాల్
ఆడమ్ మిల్నే, క్వెనా మఫాకా, తుషార్ దేశ్‌పాండే, కుల్దీప్ సేన్, యుధ్వీర్ సింగ్, విఘ్నేష్ పుత్తూర్, రవి సింగ్, షిమ్రాన్ హెట్‌మయర్
మిగిలిన బడ్జెట్: రూ.27.05 కోట్లు
భర్తీ చేయాల్సిన స్లాట్లు: 6 (విదేశీ ఆటగాళ్లు – 3)
ప్రస్తుతం రాజస్థాన్ వద్ద రూ.27.05 కోట్లు ఉన్నాయి. 6 స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అందులో 3 ఓవర్సీస్ స్లాట్లు. హెట్‌మయర్ స్థానంలో ఒక విదేశీ పవర్-హిట్టర్, మిడిల్ ఆర్డర్‌లో ఒక భారత బ్యాటర్ ఖచ్చితంగా అవసరం. బౌలింగ్ పరంగా రాజస్థాన్ దాదాపు పర్ఫెక్ట్‌గా ఉంది. షమీ, ఆర్చర్, జడేజా, బిష్ణోయ్ ఉన్నప్పుడు ప్రత్యర్థిని 160 లోపు కట్టడి చేయగలదు. కానీ, డెత్ ఓవర్లలో మ్యాచ్ ఫినిష్ చేసే ఆటగాడే అసలు లోటు. వేలంలో ఆ ఒక్క పజిల్ పూరిస్తే.. 2008 తర్వాత మళ్లీ జైపూర్‌లో సంబరాలు మొదలైనా ఆశ్చర్యం లేదు!