
IPL 2026 Schedule : ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం అంతా టీ20 వరల్డ్ కప్ 2026 ఫీవర్‌లో మునిగిపోయింది. టీమిండియా సెమీఫైనల్ చేరుతుందా లేదా అనే ఉత్కంఠలో ఫ్యాన్స్ ఉండటంతో ఐపీఎల్ గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. అయితే తెరవెనుక ఐపీఎల్ పండుగకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. మొదట అనుకున్న తేదీ కంటే టోర్నీ కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుందని సమాచారం.
ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. వాస్తవానికి, బీసీసీఐ గతంలోనే అన్ని ఫ్రాంచైజీలకు పంపిన సమాచారం ప్రకారం మార్చి 26 నుంచే టోర్నీ మొదలవ్వాల్సింది. అంటే రెండు రోజులు ఆలస్యంగా ఈ క్రికెట్ జాతర షురూ కాబోతోంది. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్‌ను మే 31న నిర్వహించాలని బోర్డు ప్లాన్ చేస్తోంది. ఈ మార్పుల వెనుక ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే కారణమని తెలుస్తోంది.
వచ్చే ఏడాది అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌కి చెన్నై, కోల్‌కతా నైట్ రైడర్స్‌కి కోల్‌కతా హోమ్ గ్రౌండ్‌లు కాగా.. రాజస్థాన్ రాయల్స్ తన రెండో హోమ్ గ్రౌండ్‌గా గువాహటి (అస్సాం)ని వాడుతోంది. ఈ నగరాల్లో భద్రత, ఎన్నికల కోడ్ వంటి అంశాల వల్ల షెడ్యూల్ ఖరారు చేయడంలో జాప్యం జరుగుతోంది. అందుకే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వచ్చే వారం సమావేశమై, ఎన్నికల తేదీలను బట్టి షెడ్యూల్‌ను రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశం ఉంది.
గతంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కూడా బీసీసీఐ ఇదే పద్ధతిని అనుసరించింది. ప్రస్తుతానికి బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, వచ్చే వారం నాటికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఐపీఎల్ హడావుడి మొదలవ్వడం ఖాయం. ధోనీ ఆడతాడా లేదా? మెగా వేలంలో ఎవరెవరు ఏ జట్లకు వెళ్తారు? అనే ఉత్కంఠలో ఉన్న ఫ్యాన్స్‌కు ఈ షెడ్యూల్ వార్త ఒక మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..