
Who Is Mohit Ulva: క్రికెట్‌లో కొన్ని ఇన్నింగ్స్‌లు గణాంకాలకు అందవు. గుండె ధైర్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. శనివారం జరిగిన అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్‌లో భారత కుర్రాడు మోహిత్ ఉల్వా ఆడిన ఇన్నింగ్స్ అలాంటిదే. దాయాది పాకిస్థాన్‌తో ఫైనల్. 338 పరుగుల కొండంత లక్ష్యం. ఒక దశలో భారత్ ఓటమి ఖాయమని అందరూ తేల్చేశారు. స్కోర్ బోర్డు మీద ఒత్తిడి, పెవిలియన్‌లో నిశ్శబ్దం. ఈ సమయంలో.. 10వ స్థానంలో క్రీజులోకి వచ్చాడు ఓ 18 ఏళ్ల పిల్లాడు. వచ్చీ రావడంతోనే పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 49 పరుగులు బాదాడు. చివరి బంతికి భారీ సిక్స్ బాది 339/9తో ఒక్క వికెట్ తేడాతో భారత్‌కు టైటిల్ అందించాడు. ఆ హీరో పేరే.. మోహిత్ ఉల్వా.
ఛేజింగ్‌లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 52 బంతుల్లో 86 పరుగులు కావాల్సిన దశలో మనల్ చౌహాన్‌తో కలిసి ఉల్వా క్రీజులో అడుగుపెట్టాడు. అక్కడి నుంచి మ్యాచ్ రూపురేఖలే మారిపోయాయి.
బౌలర్ ఎవరైనా సరే.. లెంగ్త్ తేడా కొడితే బౌండరీకి తరలించడమే పనిగా పెట్టుకున్నాడు. 188.46 స్ట్రైక్ రేట్‌తో పాక్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. మనల్ చౌహాన్ ఒకవైపు అండగా నిలవగా, ఉల్వా కౌంటర్ అటాక్‌తో చెలరేగాడు. చివరి ఓవర్ ఉత్కంఠ మధ్య.. చివరి బంతికి ఆరు పరుగులు కావాల్సిన చోట ఏమాత్రం తొణకకుండా భారీ సిక్స్ బాది హీరో అయ్యాడు.
ఈ మ్యాచ్‌లో బంతితో 8 ఓవర్లు వేసి 57 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయినా.. బ్యాట్‌తో మాత్రం దేశానికి కప్ అందించిన యోధుడిగా మిగిలిపోయాడు.
నవంబర్ 30, 2007న గుజరాత్‌లోని సౌరాష్ట్రలో జన్మించిన మోహిత్ ఉల్వా కుడిచేతి మీడియం పేసర్, కుడిచేతి బ్యాటర్.
అతని క్రికెట్ ప్రయాణం ఏ పెద్ద నగరంలోనో మొదలు కాలేదు. తన ఊరిలో టెన్నిస్ బాల్ క్రికెట్‌తో మొదలైంది. గల్లీ క్రికెట్‌లో సిక్సర్లు బాదే కుర్రాడు.. ఆ తర్వాత సౌరాష్ట్ర ఏజ్-గ్రూప్ సిస్టమ్‌లోకి వచ్చాడు. జామ్‌నగర్‌లోని క్రికెట్ బంగ్లా అకాడమీలో మహేంద్రసిన్హ్ చౌహాన్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఈ పేరు గుర్తుపెట్టుకోండి.. ఎందుకంటే ఇతనే టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చిన్నప్పుడు కోచింగ్ ఇచ్చిన గురువు.
జడేజా మట్టి వాసన ఉన్న అకాడమీ నుంచే మరో పోరాట యోధుడు వచ్చాడని ఇప్పుడు క్రికెట్ వర్గాలు ముచ్చటపడుతున్నాయి.
టెయిలెండర్లు వచ్చి రెండు మూడు షాట్లు ఆడటం వేరు.. 338 పరుగుల ఒత్తిడిలో, పాకిస్థాన్‌తో ఫైనల్ ఒత్తిడిలో, చివరి బంతి దాకా నరాలను అదుపులో పెట్టుకుని మ్యాచ్ ఫినిష్ చేయడం వేరు. అది అనుభవజ్ఞులకే అసాధ్యం. 18 ఏళ్ల వయసులో ఉల్వా చేసి చూపించాడు.
భారత అండర్-19 క్రికెట్ చరిత్రలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే విజయం. స్కోర్‌బుక్‌లో 49 నాటౌట్ అని మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ రాత్రి కోట్లాది మంది భారత అభిమానుల గుండెల్లో ఉల్వా 100కు తక్కువేం కాదు.
గల్లీ నుంచి గ్రౌండ్ దాకా.. జామ్‌నగర్ నుంచి ఆసియా కప్ ఫైనల్ దాకా.. మోహిత్ ఉల్వా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఈ పేరును గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో టీమిండియా సీనియర్ జట్టులో వినిపించబోయే పేరు ఇదే కావచ్చు!