
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్‌కు చేరుతున్న కొద్దీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. ఈసారి కప్పు గెలిచే ఫేవరెట్ జట్ల జాబితా నుంచి ఆయన టీమిండియాను పూర్తిగా పక్కన పెట్టేశారు. భారత్ సెమీఫైనల్ రేసులో ఉన్నప్పటికీ, టైటిల్ నెగ్గే సత్తా మాత్రం ప్రస్తుతానికి ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లకే ఉందని గవాస్కర్ కుండబద్దలు కొట్టారు. సొంత గడ్డపై జరుగుతున్న టోర్నీలో భారత్‌కు మద్దతు ఇవ్వకుండా, గవాస్కర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుత సూపర్ 8 పరిస్థితులను గమనిస్తే.. భారత్, వెస్టిండీస్ జట్లు సెమీస్ బెర్త్ కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోయే భారత్-వెస్టిండీస్ మ్యాచ్ సెమీస్ దిశగా అత్యంత కీలకం కానుంది. అయితే గవాస్కర్ మాత్రం సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల బౌలింగ్, బ్యాటింగ్ డెప్త్ చూసి ముగ్ధులయ్యారు. ముఖ్యంగా సౌతాఫ్రికా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా దూసుకుపోతోంది. గ్రూప్ దశలో కెనడా, ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్ వంటి జట్లను ఓడించి, సూపర్ 8లో భారత్, వెస్టిండీస్‌లపై కూడా విజయం సాధించి సెమీస్‌లో పాగా వేసింది.
ఇక ఇంగ్లాండ్ జట్టుపై గవాస్కర్ ప్రశంసలు కురిపిస్తూ.. ఆ జట్టులో స్పిన్, పేస్ బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. టోర్నీ ఆరంభంలో నేపాల్‌పై అతికష్టంగా నెగ్గి, వెస్టిండీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయినప్పటికీ.. ఆ తర్వాత పుంజుకున్న తీరు అద్భుతమని ఆయన కొనియాడారు. ముఖ్యంగా ఆసియా దేశాలైన శ్రీలంక, పాకిస్థాన్‌లను స్పిన్ ట్రాక్‌లపై ఓడించడం ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని గవాస్కర్ విశ్లేషించారు. “నా దృష్టిలో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లే అసలైన ఫేవరెట్లు. భారత్ కంటే ఈ రెండు జట్లకే కప్పు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి” అని ఆయన ఇండియా టుడేతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
సెమీఫైనల్ సమీకరణాల ప్రకారం.. సౌతాఫ్రికా తన గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఇంగ్లాండ్ తన చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడిస్తే టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. అలా జరిగితే ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ లేదా వెస్టిండీస్‌తో ఇంగ్లాండ్ తలపడాల్సి ఉంటుంది. గవాస్కర్ అంచనాలు నిజమవుతాయా? లేక తన విమర్శకులకు బ్యాట్‌తో సమాధానం చెబుతూ టీమ్ ఇండియా విశ్వవిజేతగా నిలుస్తుందా? అనేది చూడాలి. ఏదేమైనా గవాస్కర్ లాంటి దిగ్గజం భారత్‌ను తక్కువ అంచనా వేయడం అభిమానులకు మాత్రం మింగుడుపడటం లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..