బోనాల పండుగలో పోతురాజు ఎవరు? ఆ రౌద్ర రూపం వెనుక అసలు రహస్యం తెలిస్తే..

తెలంగాణ రాష్ట్ర పండుగైన ఆషాఢ బోనాల ఉత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భక్తుల కోలాహలం, శివసత్తుల పూనకాలు, తొట్టెల ఊరేగింపులతో పాటు ఈ పండుగలో అందరి దృష్టిని ఆకర్షించే ముఖ్యమైన పాత్ర పోతురాజు. మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, మహంకాలమ్మ వంటి గ్రామదేవతల ఊరేగింపులో పోతురాజు లేనిదే బోనాల ఉత్సవం పూర్తికాదు. అసలు పోతురాజు ఎవరు? బోనాల పండుగలో ఆయన ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

బోనాల పండుగలో పోతురాజు ఎవరు? ఆ రౌద్ర రూపం వెనుక అసలు రహస్యం తెలిస్తే..
Pothuraju Significance

Updated on: Aug 04, 2026 | 11:48 AM

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగలో పోతురాజు పాత్ర అత్యంత ముఖ్యమైనది. పురాణాలు, జానపద కథల ప్రకారం… పోతురాజును ఏడుగురు అక్కచెల్లెళ్లైన గ్రామదేవతలకు ఏకైక సోదరుడిగా భావిస్తారు. అమ్మవార్లు ఊరేగింపుగా వస్తున్నప్పుడు వారికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా, దుష్టశక్తుల నుంచి రక్షణగా పోతురాజు ముందు నడుస్తాడు. అందుకే బోనాల ఊరేగింపులో పోతురాజు అమ్మవారి బోనం కంటే ముందు భాగంలో నడుస్తూ ఉంటాడు.

పోతురాజు వేషధారణ అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉగ్రరూపంతో ఉంటుంది. పోతురాజు ఒంటి నిండా పసుపు పూసుకుని, నుదుటున పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. కాళ్లకు గజ్జెలు, నడుముకు ఎర్రటి లేదా రంగురంగుల వస్త్రం ధరిస్తారు. చేతిలో తాళ్లతో చేసిన కసాట అని పిలువబడే పెద్ద కొరడాను పట్టుకుని, దాన్ని తన శరీరంపై కొట్టుకుంటూ భీకర శబ్దాలు చేస్తాడు. ఈ శబ్దం వల్ల దుష్టశక్తులు పారద్రోలబడతాయని భక్తుల విశ్వాసం.

ప్రాచీన కాలంలో గ్రామానికి కలరా, ప్లేగు, అమ్మవారు వంటి భయంకరమైన వ్యాధులు వ్యాపించినప్పుడు గ్రామ దేవతలను శాంతింపజేయడానికి పోతురాజు ముందుండి పూజలు నిర్వహించేవాడు. పోతురాజు నాట్యం చేయడం వల్ల గ్రామానికి పట్టిన పీడలు, దృష్టి దోషాలు, వ్యాధులు తొలగిపోతాయని ప్రజలు బలంగా నమ్ముతారు.

బోనాల చివరి రోజున జరిగే రంగం కార్యక్రమం దీన్ని భవిష్యవాణి అని కూడా అంటారు. గావు పట్టడం వంటి ఘట్టాలలో పోతురాజు పాత్ర అత్యంత కీలకమైనది. తెలంగాణ సంస్కృతిలో వీరత్వానికి, రక్షణకు పోతురాజు ఓ గొప్ప ప్రతీక.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us