
Tiruchanur Panchami Theertham Story Telugu: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన ఘట్టం పంచమితీర్థం. శ్రీ పద్మావతి అమ్మవారు పద్మపుష్కరిణిలో ఆవిర్భవించిన పవిత్రమైన రోజును పంచమితీర్థంగా జరుపుకుంటారు. బ్రహ్మోత్సవాల చివరి రోజున నిర్వహించే ఈ వేడుకకు ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా పద్మపుష్కరిణి విశిష్టత, అమ్మవారి ఆవిర్భావం, పంచమితీర్థం ఉత్సవాల నిర్వహణ గురించి ఆలయ అర్చకులు శ్రీ అర్చకం వకుళాభరణం శ్రీనివాస మణికంఠ భట్టర్ వివరించారు. కాగా, డిసెంబర్ 5 నుంచి 14 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.
శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన 18 పురాణాల్లో పాద్మపురాణం ఒకటి. ఇందులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆవిర్భావ వృత్తాంతం వివరించబడింది. ఒకసారి సప్తఋషులు యజ్ఞానికి ఫలితమిచ్చే దైవం కోసం అన్వేషిస్తూ వైకుంఠానికి చేరుకున్నారు. ఆ సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు యోగనిద్రలో ఉండటంతో భృగుమహర్షిని గమనించలేదు. దీంతో ఆగ్రహించిన భృగువు స్వామివారి వక్షస్థలంపై తన్నాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన అమ్మవారు పాతాళలోకానికి వెళ్లిపోయారు.
అమ్మవారిని వెతుక్కుంటూ స్వామివారు పాతాళలోకానికి చేరుకున్నారు. భూమాత సహకారంతో 56 దేశాలు తిరిగినా అమ్మవారి ఆచూకీ లభించలేదు. చివరకు కొల్హాపురంలోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. అప్పుడు అశరీరవాణి స్వర్ణముఖి నదీతీరానికి వెళ్లి బంగారు పుష్పాలతో తపస్సు చేస్తే అమ్మవారు ప్రసన్నమవుతారని సూచించింది.
దీంతో స్వామివారు స్వర్ణముఖి నదీతీరంలో ‘కుంతలము’ అనే ఆయుధంతో పుష్కరిణిని తవ్వించారు. వాయుదేవుడి ద్వారా స్వర్గలోకం నుంచి బంగారు పుష్పాలను తెప్పించారు. స్వర్ణకమలాలు వికసించేందుకు వైఖానసాగమ ప్రకారం శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించారు. అనంతరం 12 సంవత్సరాల పాటు క్షీరాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ మంత్రజపం, తపస్సు, అర్చనలు చేశారు.
13వ సంవత్సరం కార్తీక మాసంలో శుక్లపక్షం, ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడిన శుక్రవారం పంచమి తిథి రోజున సహస్రదళ స్వర్ణపద్మం నుంచి శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించారు. నాలుగు చేతులు, పద్మాల వంటి కళ్లు, దివ్యాభరణాలు, వస్త్రాలతో అమ్మవారు దర్శనమిచ్చారు. బ్రహ్మదేవుడు, పార్వతీ పరమేశ్వరులు, ఇంద్రుడు, అష్టదిక్పాలకులు, సప్తఋషులు తదితర దేవతలు ఈ దివ్య ఘట్టానికి విచ్చేశారు. అనంతరం అమ్మవారు శ్రీనివాసుడికి తామరపూల మాలను అలంకరించగా, స్వామివారు అమ్మవారికి పద్మాన్ని సమర్పించారు.
చూర్ణాభిషేకం: పంచమితీర్థం రోజున ఉదయం ధ్వజారోహణ మండపంలో అమ్మవారికి చూర్ణాభిషేకం నిర్వహిస్తారు. అమ్మవారి ఆవిర్భావ దినోత్సవం కావడంతో నువ్వుల నూనె, చూర్ణపొడితో అభ్యంగన స్నానం చేయిస్తారు. ఈ సమయంలో శ్రీమంత్రం, శ్రీ సూక్తం పఠిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పంచమితీర్థ మండపానికి తీసుకెళ్తారు.
పంచమితీర్థ మండపంలో పూజలు: ఇక్కడ అమ్మవారి ఉత్సవమూర్తితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను వేదికపై ఆశీనులను చేస్తారు. తొమ్మిది కలశాలను ఏర్పాటు చేసి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన సారెను అమ్మవారికి సమర్పిస్తారు. ఇందులో పసుపు, కుంకుమ, చందనం, స్వామివారి వస్త్రాలు, దివ్యమాలలు, ఆభరణాలు, లడ్డూ, వడ, అప్పం వంటి ప్రసాదాలు ఉంటాయి.
శ్రీరామస్థూపం: తిరుచానూరు పద్మపుష్కరిణి ఒడ్డున శ్రీరామస్థూపం ఉంది. 1970వ దశకంలో శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి దీనిని నిర్మించారు. ఈ సందర్భంగా 27 రోజుల పాటు రామాయణ పారాయణం, రామహోమం, హవనాలు నిర్వహించారు. అనంతరం శ్రీరామకోటి పుస్తకాలను స్థూపంలో ఉంచి ప్రతిష్ఠించారు. ఇలా పంచమితీర్థం ఉత్సవం తిరుచానూరు ఆలయ సంప్రదాయాలు, పురాణ విశిష్టతను చాటిచెబుతూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.
(Disclaimer: ఈ కథనంలోని పురాణ గాథలు, ఆధ్యాత్మిక విశేషాలు పద్మపురాణం తదితర సంప్రదాయ విశ్వాసాలు, ఆలయ అర్చకులు తెలిపిన వివరాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని భక్తి, ఆధ్యాత్మిక కోణంలో చూడగలరు.)