తిరుమల ఆలయంలో నాలుగు మాడ వీధుల ఏర్పాటు వెనుక ఆసక్తికర చరిత్ర.. రూపకర్త ఎవరో తెలుసా?

Tirumala Temple Mada Veedhula History Telugu: తిరుమల శ్రీవారి ఆలయానికి భగవద్ రామానుజాచార్యులు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. నాలుగు మాడ వీధుల ఏర్పాటు, బ్రహ్మోత్సవాల నిర్వహణ, జీయర్ వ్యవస్థ, నైవేద్యాల సమర్పణతో పాటు దేవతామూర్తుల ప్రతిష్ఠలో ఆయన పాత్ర ఏమిటి? నేటికీ కొనసాగుతున్న ఆధ్యాత్మిక సంప్రదాయాల వెనుక ఉన్న విశేషాలు తెలుసుకుందాం.

తిరుమల ఆలయంలో నాలుగు మాడ వీధుల ఏర్పాటు వెనుక ఆసక్తికర చరిత్ర.. రూపకర్త ఎవరో తెలుసా?
Tirumala Temple Mada Veedhula History Telugu

Updated on: Nov 14, 2026 | 9:05 PM

Tirumala Temple Naalugu Mada Veedhula Charitra: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్వహణ, ఆగమ సంప్రదాయాలు, ఉత్సవాల నిర్వహణలో భగవద్ రామానుజాచార్యుల సేవలు ఎంతో విశిష్టమైనవి. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఆయన ప్రవేశపెట్టిన, క్రమబద్ధీకరించిన అనేక సంప్రదాయాలు నేటికీ తిరుమల ఆలయంలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు నాలుగు మాడ వీధుల ఏర్పాటు, జీయర్ వ్యవస్థ, నిత్య కైంకర్యాలు, నైవేద్యాల సమర్పణ వంటి అంశాల్లో ఆయన పాత్ర చిరస్మరణీయం.

బ్రహ్మోత్సవాలకు నాలుగు మాడ వీధులు

తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల ఏర్పాటు వెనుక రామానుజాచార్యుల పాత్ర కీలకమని ఆలయ చరిత్ర చెబుతోంది. గతంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎనిమిది రోజులపాటు తిరుచానూరులో నిర్వహించేవారని సంప్రదాయ కథనాలు పేర్కొంటున్నాయి. నాలుగు మాడ వీధుల ఏర్పాటు తర్వాత బ్రహ్మోత్సవాలను తిరుమలలోనే నిర్వహించే విధానం ప్రారంభమైంది. నేడు వాహన సేవలు, ఊరేగింపులు, భక్తులకు స్వామివారి దర్శనం ఈ వీధుల్లోనే వైభవంగా జరుగుతున్నాయి.

మాడ వీధులకు వేదాల పేర్లు

తిరుమలలోని నాలుగు మాడ వీధులకు టీటీడీ ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పేర్లను పెట్టింది. తూర్పు మాడ వీధికి ఋగ్వేద మార్గం, దక్షిణ మాడ వీధికి యజుర్వేద మార్గం, పడమర మాడ వీధికి సామవేద మార్గం, ఉత్తర మాడ వీధికి అథర్వణ వేద మార్గంగా నామకరణం చేసింది. అలాగే ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రాంగణానికి రామానుజాచార్యుల సేవలకు గుర్తుగా శ్రీ రామానుజాచార్యుల ప్రాంగణంగా పేరు పెట్టింది.

ఇవి కూడా చదవండి

జీయర్ వ్యవస్థ ఏర్పాటు

వైఖానస ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయంలో జరిగే కైంకర్యాలు, ఆచార వ్యవహారాలను పర్యవేక్షించేందుకు రామానుజాచార్యులు జీయర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆయన ఆధ్వర్యంలో వెంకటనాథ శఠగోప యతి లేదా జీయర్ మఠం తిరుమలలో ఏర్పాటైంది.

ఆలయ కైంకర్యాలు, ఉత్సవాలకు రూపకల్పన

ఆళ్వార్ల దివ్యప్రబంధంలోని శ్రీవేంకటేశ్వరస్వామికి సంబంధించిన 250కి పైగా పాశురాల పారాయణాన్ని ఆలయంలో ప్రవేశపెట్టారు. ఇందుకోసం ఆచార్య పురుషులను నియమించారు. ఇతర మఠాల పీఠాధిపతులు, జీయర్లు తిరుమలకు వచ్చినప్పుడు పూర్ణకుంభ స్వాగతం పలికి తీర్థం, ప్రసాదం, శేషవస్త్రం అందించే సంప్రదాయాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. గోదా కల్యాణం, తన్నీరముదు, భగ్ సవారి వంటి ఉత్సవాలకు కూడా ఆయన రూపకల్పన చేసినట్లు ఆలయ చరిత్ర పేర్కొంటోంది.

నైవేద్యాల సమర్పణలో ప్రత్యేక శ్రద్ధ

భక్తులకు అన్నప్రసాదాలు అందించే విధానంతోపాటు స్వామివారికి సమర్పించే నైవేద్యాల తయారీలోనూ రామానుజాచార్యులు ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆలయ వంటశాలలోనే నైవేద్యాలను సిద్ధం చేయాలని, శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే వంటవారితో వాటిని తయారు చేయించాలని సూచించారు. గుడాన్నం, చిత్రాన్నం, పాయసం, అతిరసం, అప్పం, దోశ వంటి పదార్థాలను స్వామివారికి సమర్పించే సంప్రదాయాన్ని ప్రోత్సహించారు.

దేవతామూర్తుల ప్రతిష్ఠలోనూ విశిష్ట సేవలు

తిరుమలలో సీతాదేవి, భూదేవి, శ్రీయోగ నరసింహస్వామి పంచలోహ అర్చామూర్తుల ప్రతిష్ఠలో రామానుజాచార్యుల పాత్ర ఉందని ఆలయ సంప్రదాయాలు చెబుతున్నాయి. సీతాదేవి అర్చామూర్తి లేకపోవడంతో ఆమె విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించడంతోపాటు సీతారాముల కల్యాణాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. అలాగే స్వామి పుష్కరిణి సమీపంలో ఉన్న నరసింహస్వామి విగ్రహానికి మండపాన్ని నిర్మించి పూజలు నిర్వహించే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం యోగ నరసింహస్వామి సన్నిధి తిరుమల ఆలయంలో ప్రముఖ ఉపాలయంగా కొనసాగుతోంది. భూదేవి అర్చామూర్తిని పూలబావిలో ప్రతిష్ఠించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని ఆలయ సంప్రదాయం తెలియజేస్తోంది.

నేటికీ కొనసాగుతున్న సంప్రదాయాలు

కాలానుగుణంగా ఆలయ నిర్వహణలో మార్పులు వచ్చినప్పటికీ, రామానుజాచార్యులు క్రమబద్ధీకరించిన అనేక ఆగమ సంప్రదాయాలు, కైంకర్యాలు, ఉత్సవ విధానాలు నేటికీ తిరుమల, తిరుపతి, తిరుచానూరు ఆలయాల్లో కొనసాగుతున్నాయి. శ్రీవారి ఆలయ వ్యవస్థకు పటిష్టమైన పునాది వేసి, స్వామివారి సేవా సంప్రదాయాలను బలోపేతం చేసిన రామానుజాచార్యుల కృషి ఆయన అపారమైన భక్తికి నిదర్శనంగా నిలుస్తోంది.

(Disclaimer: ఈ కథనంలోని చారిత్రక, ఆధ్యాత్మిక అంశాలు తిరుమల ఆలయ సంప్రదాయాలు, అందుబాటులో ఉన్న చారిత్రక కథనాల ఆధారంగా అందించబడ్డాయి. కొన్ని అంశాలు సంప్రదాయ విశ్వాసాలకు సంబంధించినవి.)

మరిన్ని ఆసక్తికర ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us