శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో నుంచి భక్తులకు మూడు సార్లు మకరజ్యోతి కనిపించింది. మకరజ్యోతి దర్శనం కాగానే స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిమల సన్నిధానం మార్మోగింది. జ్యోతి దర్శనంతో భక్తులు ఆనంద పరవశానికి లోనయ్యారు. జ్యోతి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమల తరలివచ్చారు. అయ్యప్ప భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మకర సంక్రాంతి పర్వదినాన జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తారని భక్తులు బలంగా నమ్ముతారు. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ముందుగా.. తిరువాభరణాలతో పందళరాజవంశీయులు సన్నిధానం చేరుకున్నారు. జ్యోతి దర్శనానికి ముందు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతి నిచ్చారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శ్రేణుల నుంచి జ్యోతి దర్శనమైంది.
మండలకాలం పాటు దీక్ష చేసి.. ఇరుముడి కట్టుకుని.. శబరిమలకు చేరుకున్నారు భక్తులు. పంబలో స్నానం చేసి.. సన్నిధానం చేరుకుని.. మణికంఠుని దర్శనం చేసుకుని.. మకర జ్యోతి దివ్యానుభూతితో పరవశించిపోయారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ తగిన జాగ్రత్తలు తీసుకుంది. పంబానది, సన్నిధానం, హిల్‌టాప్, టోల్ ప్లాజా సహా మొత్తం పది పాయింట్ల దగ్గర అధికారులు ఏర్పాట్లు చేయడంతో జ్యోతి దర్శనం చేసుకున్నారు భక్తులు.
మకర జ్యోతి దర్శనం తర్వాత కొండ నుంచి కిందకు దిగే సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు అధికారులు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..