ప్రకృతి పరమేశ్వరుడిని ఆరాధించే దృశ్యం.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే అనుభూతి..!

ప్రకాశం జిల్లా అద్దంకిలోని నాగేశ్వరాలయలో అరుదైన 'సూర్య స్పర్శ' ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని శివలింగంపై సూర్యకిరణాలు నేరుగా పడి అద్భుత దర్శనం కలిగించాయి. ఏడాదికి రెండుసార్లు మాత్రమే జరిగే ఈ వింత.. ప్రాచీన వాస్తు నైపుణ్యాన్ని, దైవ మహిమను చాటుతుంది. దక్షిణాయనంలో మూడు రోజుల పాటు కొనసాగే ఈ దృశ్యం భక్తులకు కనుల పండుగ.

ప్రకృతి పరమేశ్వరుడిని ఆరాధించే దృశ్యం.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే అనుభూతి..!
Addanki Nageswara Temple

Edited By:

Updated on: Sep 27, 2026 | 10:56 AM

సైన్స్‌నా? దైవ రహస్యమా? లేక ప్రాచీన శిల్పకళా వైభవమా? ప్రకాశం జిల్లా అద్దంకిలో ఒక అరుదైన వింత ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని పరమశివుడిని ప్రత్యక్షంగా ఆదిత్యుడు పూజించాడు. చీకటి గర్భగుడిని చీల్చుకుంటూ వచ్చిన లేలేత సూర్యకిరణాలు.. నేరుగా ఆ నగేశ్వరుడి లింగాకృతిపై పడి బంగారు కాంతులీనాయి

సూర్యుడే మొదటి పూజారిగా మారిన అద్భుత ఘట్టం ఇది. అద్దంకి పట్టణంలోని ప్రసిద్ధ వెయ్యి స్తంభాల గుడిగా పిలిచే శ్రీ గంగా వింధ్యవాసిని సమేత నాగేశ్వర స్వామివారి ఆలయం.. ఈ అపురూప దృశ్యానికి వేదికైంది. ఏడాదికి రెండు సార్లు మాత్రమే జరిగే విస్మయం ఇది… ఉత్తరాయణంలో సింగరకొండ తిరునాళ్ల తర్వాత.. దక్షిణాయనంలో సరిగ్గా వినాయక చవితి ముగిసిన కొద్ది రోజులకే ఈ కిరణ స్పర్శ జరుగుతుంది. దక్షిణాయన కాలంలో వరుసగా మూడు రోజుల పాటు సూర్యభగవానుడు స్వామివారిని దర్శించుకోనున్నారు. అందులో భాగంగానే నేడు తొలి స్పర్శ భక్తులకు కనువిందు చేసింది.

అభిషేకం పూర్తయ్యే సరికి కిరణాల తాకిడితో శివలింగం దివ్యకాంతులతో ప్రకాశించింది. శతాబ్దాల నాటి వాస్తు నైపుణ్యమో, స్వామివారి మహిమో కానీ.. ఈ అరుదైన సూర్య స్పర్శా దర్శనం చేసుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు. రేపు, ఎల్లుండి కూడా ఈ అద్భుతం పునరావృతం కానుంది. ప్రకృతి పరమేశ్వరుడిని ఆరాధించే ఈ దృశ్యం నిజంగా ఒళ్లు గగుర్పొడిచే అనుభూతి.

అపురూప దృశ్యం ఇక్కడ చూడండి..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us