
థాయిలాండ్, మయన్మార్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఇవాళ ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.. ఇది శుక్రవారం నాటికి ఆగ్నేయ, ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతంగా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయువ్య దిశగా కదిలి ఆ తర్వాత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈదురు గాలులతోపాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ కింద ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్ చూడండి..

ఏపీలో వర్షాలు: ఉత్తరాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో పోలవరం, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో బుధవారం (21-10-2026) ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

తెలంగాణ వాతావరణం: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.