
తెలంగాణ స్పెషల్ వంటకమైన గుడాలను అనేక రకాలుగా తయారు చేసుకోవచ్చును. చాలా మంది పల్లెటూర్లలో మొక్కజొన్నలు, అనుప గింజలు, లేదా చిక్కుడు గింజలతో తయారు చేస్తుంటారు. దీని కోసం మందుగా అనుప గింజలు కప్పు, చిక్కుడు గింజలు కప్పు వేసి బాగా కడిగి నానబెడతారు. తర్వాత రెండు కప్పుల మక్కజొన్నలు తీసుకుంటారు. వీటిని రోటిలో దంచుతారు. దీని వలన మొక్కజొన్న గింజలు రెండుగా చీలిపోతాయి. ఇలా చేయడం వలన ఇవి చాలా త్వరగా ఉడుకుతాయి.

తర్వాత ఒక మట్టి కుండ తీసుకొని, దానిలో మొక్కజొన్నలు ముందుగా వేసి, సరిపడ నీళ్లు పోసి ఉడకబెడతారు.10 నిమిషాల తర్వాత అందులో అనుప గింజలు, చిక్కుడు గింజలు వేసి మరో 20 నిమిషాల పాటు ఉడకబెడతారు. ఇలా మంచిగా ఉడికిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెడుతారు. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో కొంచెం నూనె పోసి, ఆవాలు, పచ్చి మిర్చీ, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తి మీర వేసి, ఫ్రై చేస్తారు. తర్వాత ఆ పోపులో ఈ ఉడకబెట్టిన గింజలు వేస్తుంటారు. తర్వాత కొంచెం, కారం, ఉప్పు వేసి మంచిగా కలుపుతారు. అంతే వేడి వేడి , ఆరోగ్యాన్నిచ్చే మొక్కజొన్న గుడాలు రెడీ.

అదే విధంగా హోలీ పండుగ సమయంలో కొందరు శనగలతో కూడా గుడాలు తయారు చేస్తుంటారు. దీని కోసం ముందుగా రెండు కప్పుల శనగలు తీసుకుంటారు. వీటిని ఒక రోజు ముందు నానబెట్టి , మరసటి రోజు ఒక బౌల్ తీసుకొని వాటిని మరోసారి శుభ్రంగా కడిగి, సరిపడ నీళ్లు పోసి ఉడకబెడతారు. ఇది కాస్త ఉడికిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసి మరో 10 నిమిషాలు ఉడకబెడతారు.

కనీసం 20 నిమిషాల పాటు ఇవి బాగా ఉడికిన తర్వాత వీటిని వేరే బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గుడాలు చాలా టేస్టీగా ఉండటం కోసం, పోపు ప్రిపేర్ చేసుకోవాలి.

దీని కోసం స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, అందులో కొంచెం నూనె పోయాలి. నూనె వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, చాలా తక్కువ మొత్తంలో పసుపు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, లైట్‌గా సాల్ట్, తరిగిన కొత్తిమీర, వేసి ఇవి మంచిగా వేగిన తర్వాత ఈ పోపును ఉడకబెట్టిన శనగల్లో వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ శనగల గుడాలు రెడీ, మరి మీరు కూడా ప్రిపేర్ చేయండి.