
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రాశ్యధిపతి కుజుడు లాభ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం అన్ని విధాలా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యానికి కూడా ఇబ్బంది ఉండకపోవచ్చు. వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. రవి, శుక్రుల బలం కూడా అధికంగా ఉన్నందువల్ల ముఖ్యమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. జీవిత భాగస్వామితో సానుకూలత ఏర్పడుతుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం, ఎవరికీ హామీలు ఉండకపోవడం, వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. గృహ, వాహన సౌకర్యాలకు బాగా ఖర్చు చేస్తారు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఆదాయం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. శత్రు, రోగ, రుణ బాధలు అదుపులో ఉంటాయి. ఉన్నత వర్గాలతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులతో అధికారాలు పంచుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడు భాగ్య స్థానంలో సంచారం చేయడం, లాభ స్థానం రవి, శుక్రులతో పటిష్ఠంగా ఉన్నందువల్ల వారమంతా సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సంతృప్తికరంగా సాగుతుంది. ఉద్యోగం సజావుగా పురోగమిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మిత్రుల వివాదాల్లో మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ముఖ్యమైన గ్రహాలతో భాగ్య, దశమ స్థానాలు బాగా బలంగా ఉన్నందువల్ల వారమంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఉంటుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను, కొన్ని అవసర పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించు కుంటారు. ఉద్యోగంలో సహచరుల సహకారం ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొందరు మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామికి ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవి భాగ్య స్థానంలో, గురువు లాభ స్థానంలో సంచరిస్తున్న కారణంగా, ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఎక్కువగా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. అష్టమ శని కారణంగా ఇంటా బయటా కొద్దిగా పని ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కొద్దిగా ఆశాభంగం చెందే సూచనలున్నాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీలు ఉండవద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడు కుజుడితో కలిసి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. డబ్బు ఇవ్వ డం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఆస్తి వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ముఖ్య మైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ ఫలితం పొందుతారు. ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించడంలో సహోద్యోగుల తోడ్పాటు ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. దగ్గర బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో ఉచ్ఛ స్థితి రవితో కలిసి ఉండడం వల్ల ఈ వారమంతా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. గురు, శనుల బలంతో పాటు రాహు, కుజులు కూడా అనుకూలంగా మారినందు వల్ల కొన్ని వ్యక్తిగత పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా మారుతాయి. సర్వత్రా మీ మాట చెల్లుబాటవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను మిత్రుల సాయంతో పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడు చతుర్థ స్థానంలో బుధుడితో కలిసి ఉన్నందువల్ల సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. బంధు మిత్రులు ఆర్థికంగా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. శని పంచమ స్థానంలో ఉన్నందువల్ల శుభ వార్తలు వినడం, అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవి తం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వ్యాపారాలకు ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వారం ద్వితీయార్థంలో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు కొద్దిగా దూరంగా ఉండాలి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో, శుక్ర, రవులు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం బాగా నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మధ్య మధ్య స్నేహితులతో సమస్యలు తలెత్తుతుంటాయి. సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశ్యధిపతి శనితో సహా గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. ఈ వారమంతా సుఖ సంతోషాలతో సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయానికి మించి కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ జీవితంలో అనుకోకుండా చికాకులు తలెత్తే సూచనలున్నాయి. ఒక శుభ కార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): పంచమ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న రవి సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులుంటాయి. ముఖ్యంగా అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ధన స్థానంలో శనితో పాటు, రవి సంచారం వల్ల కుటుంబంలో తరచూ టెన్షన్లు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో, రవి, శుక్రులు ధన స్థానంలో సంచారం చేయడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి లభించే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, అనవసర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొద్దిపాటి ప్రయత్నంతో ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. అనవసర వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మంచి ఆఫర్లు అందివస్తాయి.