
జ్యోతిష శాస్త్రం ప్రకారం, జాతక చక్రంలో లగ్నాధిపతి లేదా రాశ్యధిఫతి ఎక్కడ ఉన్నాడన్న దాని మీదే వ్యక్తి జీవితం ఆధారపడి ఉంటుంది. లగ్నాధిపతి లేదా రాశ్యధిపతి తన ఉచ్ఛ, స్వక్షేత్ర, మిత్ర క్షేత్రాలలో ఉన్న పక్షంలో జాతకం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. చీకూచింతా లేని జీవితం లభిస్తుంది. రాశ్యధిపతి బలహీనంగా ఉన్నా, నీచ, శత్రు క్షేత్రాల్లో ఉన్నా జాతకంలో ఎన్ని యోగాలున్నా ఫలించకపోగా సమస్యలు, అనారోగ్యాలతో పోరాడాల్సి వస్తుంది. ప్రస్తుత గ్రహ చారాన్ని బట్టి మేషం, వృషభం, సింహం, కన్య, తుల, ధనూ రాశుల వారికి జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

మేషం: ఈ రాశి అధిపతి అయిన కుజుడు ఈ నెల(మే) 12 నుంచి మేష రాశిలోనే సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి జూన్ 20 వరకు రాజయోగాలు, ధన యోగాలు పట్టబోతున్నాయి. ఉద్యోగంలో అధికార యోగం కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. అనేక విధాలుగా సిరిసంపదలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా, తీరిక లేకుండా సాగిపోతాయి. ధన ధాన్య సమృద్ధి యోగం పడుతుంది.

వృషభం: స్వక్షేత్రంలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి శుక్రుడు తర్వాత మిత్ర క్షేత్రమైన మిథున రాశిలో ప్రవే శిస్తున్నందువల్ల నెలన్నర పాటు ఈ రాశివారి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉన్నతోద్యోగ సంబంధమైన పోటీ పరీక్షల్లో నెగ్గడం జరుగుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

సింహం: ఈ రాశినాథుడైన రవి గ్రహం ఈ నెల 15 వరకు ఉచ్ఛ స్థితిలోనూ, ఆ తర్వాత దశమ స్థానమైన వృషభ రాశిలోనూ సంచరించడం జరుగుతోంది. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు సఫలం అవుతాయి. విదేశీయానానికి, విదేశాల్లో ఉద్యోగాలకు, చదువులకు సంబంధించి ఆటంకాలు ఏవైనా ఉన్న పక్షంలో అవి తొలగిపోతాయి. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి.

కన్య: రాశ్యధిపతి బుధుడు ఈ నెల 14 నుంచి భాగ్య స్థానంలోకి, నెలాఖరు నుంచి దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల తప్పకుండా ఆదాయ వృద్ధి, వృత్తి, ఉద్యోగాలలో పురోగతి లేదా ప్రమోషన్ వంటివి చోటు చేసుకోవడం జరుగుతుంది. అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి, ఆర్థిక సంబంధమైన నిర్ణయాలు, ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి.

తుల: ప్రస్తుతం స్వక్షేత్రంలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి శుక్రుడు ఈ నెల 15న భాగ్య స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల ఆర్థికపరంగా తప్పకుండా అదృష్టం పట్టిస్తాడు. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా అది విజయవంతం అవుతుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు లభిస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.

ధనుస్సు: ఈ రాశినాథుడైన గురు గ్రహం సప్తమ స్థానంలో, అనుకూల స్థానమైన మిథున రాశిలో సంచరిస్తున్నందు వల్ల ఈ రాశివారికి జూన్ మొదటి వారం వరకు మహా రాజయోగం పడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఇతరులకు ఉపయోగ పడే పనులు చేయడం జరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది.