
ధనవంతులైనా.. వంద ఎకరాల భూమి ఉన్న రైతులు అయినా.. ఆ ఊరిలో మేడలు కట్టరు. అందుకు కారణం.. ఆ గ్రామ ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే హుచ్చువీరప్ప తాత ఆలయం. ఆ ఆలయం ఎత్తును మించి ఇల్లు కట్టకూడదనే ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అరుదైన ఆ ఊరు ఎక్కడ ఉందంటే కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతురు.

కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతురులో అన్ని కులాల వారు హుచ్చు వీరప్ప తాతను భక్తితో పూజిస్తారు. ఆ గ్రామ కట్టుబాటు మేరకు తాత ఆలయం ఎత్తును మించి ఇళ్ల నిర్మాణలు చేపట్టరు.

అందుకు కారణం వంద ఏళ్ల క్రితం ఆ గ్రామంలో ఒక భూస్వామి.. ఆ ఆలయం ఎత్తును మించి ఇల్లు నిర్మాణం చేసే సమయంలోనే వారి కుటుంబలో ఏదో ఒక ఊహించని సంఘటన జరిగిందని ప్రచారం. అంతేగాక, ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఊరు వదిలి వెళ్లరాని తెలిసింది. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామంలో ఏ ఒక్కరు మేడలు కట్టరు. అందుకు ఆ గ్రామానికి మేడ లేని ఊరు అని పిలుస్తారు.

అందరికి ఆవే పేర్లు.. ఆ గ్రామంలో భక్తి శ్రద్ధలతో పూజించే హుచ్చు వీరప్ప తాత పేరు ఎక్కువగా ఉంటాయి. పెద్ద హుచ్చురప్ప.. చిన్న హుచ్చురప్ప.. పెద్ద హుచురమ్మ.. చిన్న హుచ్చురమ్మ.. అనే పేర్లు అన్ని ఇళ్లలో అధికంగా ఉండడం విశేషం.

ప్రతి ఏటా ఉత్సవాలు.. హుచ్చు వీరప్ప తాత ఆరాధన ఉత్సవాలు ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో వారం రోజులు పాటు జరుగుతాయి. ఈ ఉత్సవలకు కర్ణాటక, ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించడం జరుగుతుంది.

పూల అలంకరణలో మొదటి ఆలయం.. ఆలూరు నియోజకవర్గం ఏ ఆలయంలో లేని విధంగా తాత వారి మూల విరాట్‌ను రక రకాల పూలతో అలంకరణ చేయడం ప్రత్యేకం. ఈ పూల అలంకరణ ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో ఏడు రోజుల పాటు పంచాక్షరి జపంతో జరుగుతాయి. ఈ పూజలు గ్రామంలో అన్ని కులాల వారు ఏడు రోజులు ఎంతో భక్తితో జరుపుకోవడం ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం.