
ప్రస్తుతం తనకు మిత్ర క్షేత్రమైన మీన రాశిలో సంచారం చేస్తున్న కుజ గ్రహం ఈ నెల(మే) 12 నుంచి జూన్ 20 వరకు తనకు స్వక్షేత్రమైన మేష రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. పట్టుదల, ధైర్యం, సాహసం, చొరవ, ప్రయత్నం వంటి లక్షణాలు కలిగిన కుజుడు సహజ సాహస రాశి అయిన మేషంలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశులకు ధన యోగాలను తీసుకొస్తుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను గడించేందుకు కుజుడు అనేక అవకాశాలను కల్పించడం జరుగుతుంది. మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశులవారు ఈ మేష కుజుడి వల్ల అత్యధికంగా లాభాలు పొందే అవకాశం ఉంది.

మిథునం: లాభాధిపతి అయిన కుజుడు లాభ స్థానంలో ప్రవేశించడం వల్ల జీవితం అభివృద్ది బాట పడుతుంది. కొన్ని కష్టనష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. శత్రు, రోగ, రుణ సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. అనుకోకుండా భూలాభం కలుగుతుంది.

కర్కాటకం: ఈ రాశికి పంచమ, దశమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో సంచారం వల్ల నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. పలుకుబడి, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది. షేర్లు అపారంగా లాభిస్తాయి.

సింహం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు భాగ్య స్థానంలో ప్రవేశం వల్ల కొద్ది ప్రయత్నంతో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. రావలసిన డబ్బును, బాకీలను రాబట్టుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన లాభాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు కనక వర్షం కురిపిస్తాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యం లాభం కలుగుతుంది.

తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో సప్తమ స్థానాధిపతి కుజ గ్రహం ప్రవేశించడం వల్ల తప్పకుండా ఆస్తి లాభం కలుగుతుంది. వారసత్వ సంపద లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఉన్నతస్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది.

ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో కుజ సంచారం వల్ల అపార ధన లాభం కలుగుతుంది. ఫేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. కుటుంబ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

మీనం: ఈ రాశికి ధన స్థానంలో ధన స్థానాధిపతి కుజుడి సంచారం వల్ల ఆస్తి సమస్యలు, వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. శత్రు, రోగ, రుణ బాధల నుంచి నివారణ లభిస్తుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులకు ఉద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సామాజికంగా ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.