
గురు, బుధ, శుక్రులతో పాటు ప్రయాణాలకు కారకుడైన చంద్రుడు కూడా బాగా అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఆదాయ వృద్ది, శుభ కార్యాలు జరగడం, పదోన్నతులు కలగడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకోవడంతో పాటు ప్రేమ వివాహాలకు, ప్రేమ యాత్రలకు, పెళ్లిళ్లకు, హ్యాపీ వివాహాలకు సమయం బాగా అనుకూలంగా ఉండడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాలు సుఖ సంతోషాలలో మునిగి తేలే అవకాశం ఉంది. జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు చివరి వరకు ప్రేమ యాత్రలు, విహార యాత్రలు ఊపందుకునే అవకాశం ఉంది. ప్రేమ, విహార యాత్రలకు అనుకూలంగా ఉన్న రాశుల్లో మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశులున్నాయి.

మేషం: ఈ రాశికి తృతీయ, చతుర్థ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారికి ప్రయాణాలు, విహారాల్లో సుఖ సంతోషాలు ఇమిడి ఉన్నాయి. ప్రేమ, పెళ్లి ప్రయత్నాల్లో విజయం సాధించిన ఈ రాశివారు తప్పకుండా ప్రేమ యాత్ర చేసే అవకాశం ఉంది. వీరికి ఈ విహార, వినోద యాత్రలు ఎక్కువగా సాగుతాయి. భారీగా ఖర్చయ్యే సూచనలున్నప్పటికీ, ప్రకృతి అందాలకు అవకాశం ఉన్న పర్వత ప్రాంతాలకు ప్రేమికులు, కొత్త దంపతులు విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశిలో రాశ్యదిపతి బుధుడి సంచారం, ధన స్థానంలో శుక్ర, గురువుల స్థితి వల్ల ఈ రాశివారికి రాబోయే రెండు మూడు నెలల కాలం ప్రయాణాలు, పర్యటనలు, పర్యాటకాలతో సాగిపోతుంది. ప్రేమ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలతో పాటు ఆదాయ ప్రయత్నాలు కూడా సఫలం కావడం వల్ల వీరు ప్రేమ యాత్రలు, విహార యాత్రల మీద డబ్బు బాగా వెచ్చించే అవకాశం ఉంది. వీరు తమ ప్రేమ యాత్రలకు ఎత్తయిన ప్రదేశాలు లేదా హిల్ స్టేషన్లకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.

కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితికి చేరుకోవడంతో పాటు రాశ్యధిపతి చంద్రుడు, బుధ, శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారు రానున్న మూడు నెలల కాలంలో సరికొత్త ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన ప్రేమికులు, కొత్త దంపతులు తప్పకుండా ప్రేమ యాత్రలు, విహార యాత్రలకు బయలుదేరే అవకాశం ఉంది. ఈ రాశివారు ఈ ఏడాది ఎక్కువగా జల ప్రాంతాలకు విహార యాత్రలు, ప్రేమ యాత్రలు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.

కన్య: ఈ రాశికి దశమ, లాభ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల రానున్న మూడు నెలల కాలంలో ఈ రాశివారి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరగడం వల్ల విస్తృతంగా విహార యాత్రలు చేయాలన్న వీరి చిరకాల కోరిక నెరవేరుతుంది. ప్రేమికులు, కొత్త దంపతులు ఈ అనుకూల సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన కొత్త దంపతులు ఎక్కువగా ఎత్తు ప్రాంతాలకు హనీమూన్ కు వెళ్లే అవకాశం ఉంది. ప్రేమ, విహార యాత్రల మీద వీరి ఖర్చు పెరుగుతుంది.

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధుడు, దశమ స్థానంలో గురు, శుక్రుల సంచారం వల్ల ఈ రాశివారు ఎక్కువ కాలం ప్రయాణాలు, పర్యటనల్లో కాలం గడిపే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన ప్రేమికులు, దంపతులు ప్రకృతి సౌందర్యం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రేమ, విహార యాత్రలకు వెళ్లడం జరుగుతుంది. జూన్ 9 తర్వాత నుంచి వీరికి ఈ యాత్రలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ యాత్రల మీద కొత్త దంపతులకు భారీగా ఖర్చయ్యే అవకాశం ఉంది.

మకరం: ఈ రాశికి జూన్ 9 నుంచి షష్ట స్థానంలో షష్టాధిపతి బుధుడి సంచారం, సప్తమ స్థానంలో గురు, శుక్రుల యుతి వల్ల ప్రయాణాలతో, పర్యటనలతో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. ఈ రాశికి చెందిన ప్రేమికులు, కొత్త దంపతులు ప్రేమ యాత్రలు, విహార యాత్రలు చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలకు, జలపాత ప్రదేశాలకు ప్రేమ యాత్రలకు, విహార యాత్రలకు వెళ్లడం జరుగుతుంది. గరిష్ట స్థాయిలో సుఖ సంతోషాలు పొందే అవకాశం ఉంది.