
నవంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసంలో కొన్ని రాశులవారికి పెళ్లయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొద్ది ప్రయత్నంతో ఈ రాశులవారికి డిసెంబర్ 9 లోపల, అంటే కార్తీక మాసం ముగిసే లోపల మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. గురు, బుధ, శుక్రులు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశుల వారు ఇప్పటి నుంచే పెళ్లి ప్రయత్నాలు సాగించడం మంచిది. ఇది ఆడవారికి, మగవారికి కూడా వర్తిస్తుంది. ప్రేమ వ్యవహారాలకు కూడా అన్వయి స్తుంది. మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ రాశులకు తప్పకుండా పెళ్లయ్యే అవకాశం ఉంది.

మేషం: ప్రేమలు, పెళ్లిళ్లకు సంబంధించిన సప్తమ స్థానంలో శుక్ర, బుధుల, పంచమ స్థానంలో గురువు సంచారం చేయడం వల్ల ఈ రాశివారు తప్పకుండా పెళ్లి సంబంధమైన శుభవార్త వినే అవకాశం ఉంది. సాధారణంగా ఇష్టపడిన బంధువుతోనో, ప్రేమించిన వ్యక్తితోనో వివాహం కుదిరే సూచనలు న్నాయి. కార్తీక మాసంలో వీరికి శుభగ్రహాల అనుకూలతలు పుష్కలంగా లభిస్తాయి. ఇప్పటి నుంచే పెళ్లి ప్రయత్నాలు చేయడం, పెళ్లి మాటలు మాట్లాడుకోవడం వంటివి చేయడం మంచిది.

మిథునం: రాశ్యధిపతి బుధుడు పంచమ స్థానంలో కళత్ర కారకుడైన శుక్రుడితో యుతి చెందడం, గురువు సప్తమ స్థానాన్ని వీక్షించడం వల్ల ఈ రాశివారికి కార్తీక మాసంలో పెళ్లి కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఆశ్వ యుజంలో చేసే పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సానుకూల ఫలితాలనిస్తాయి. కొద్ది ప్రయత్నంతోనే పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కూడా తప్పకుండా సక్సెస్ అవుతాయి.

కర్కాటకం: ఈ రాశికి సౌఖ్య, సౌభాగ్య స్థానమైన చతుర్థ స్థానంలో బుధ, శుక్రులు కలిసి ఉండడం, కుటుంబ స్థానంలో గురువు సంచారం ప్రారంభించడం వల్ల కార్తీక మాసం వివాహ వేడుకలకు బాగా అను కూలంగా ఉంది. ఆశ్వయుజమాసంలో కూడా ఈ మూడు శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందు వల్ల ఇప్పుడు చేపట్టే పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఈ రాశి వారికి విదేశీ సంబంధం నిశ్చయం అవుతుంది. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది.

తుల: డిసెంబర్ మొదటి వారం వరకు శుక్ర, బుధులు ఈ రాశిలో కలిసి ఉండడం, ఈ నెలాఖరులో గురువు లాభ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి కార్తీక మాసంలో తప్పకుండా వివాహ మయ్యే సూచనలున్నాయి. ప్రేమ జీవితం పెళ్లి జీవితంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. అక్టోబర్ చివర్లో కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారి వివాహం తప్పకుండా నిశ్చయం అవుతుంది. వీరికి సహోద్యోగులు లేదా ప్రేమికులు, పరిచయస్థులతో పెళ్లి కుదరడానికి బాగా అవకాశం ఉంది.

ధనుస్సు: రాశ్యధిపతి గురువు భాగ్య స్థానంలోకి ప్రవేశించడం, లాభస్థానంలో గురు, బుధుల సంచారం వల్ల ఈ రాశివారికి కార్తీక మాసంలో ఒక సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అక్టోబర్ 17 నుంచి గట్టి ప్రయత్నాలు చేయడం మంచిది. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది. ఈ రాశివారికి ప్రేమ పెళ్లి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కొద్ది ప్రయత్నంతో బాగా పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదిరే సూచనలు కూడా ఉన్నాయి.

కుంభం: ఈ రాశికి అక్టోబర్ చివరలో సప్తమ స్థానంలోకి గురువు ప్రవేశించడం, శుభ కార్యాలకు సంబంధించిన భాగ్య స్థానంలో శుక్ర, బుధుల సంచారం వల్ల ఈ రాశివారికి ఆకస్మిక వివాహ యోగానికి బాగా అవకాశం ఉంది. అక్టోబర్ నుంచి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించడం మంచిది. కార్తీక మాసం వీరి వివాహానికి బాగా అనుకూల సమయం. ప్రేమ వివాహానికి బాగా అవకాశం ఉంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ ప్రయత్నాలు ఫలిస్తాయి.