
ఆదాయానికి, సుఖ సంతోషాలకు, పెట్టుబడులకు, మదుపులకు కారకులైన గురు, శుక్ర, బుధులు వరుసగా వృషభ, మిథున రాశుల్లో సంచారం చేస్తున్న కారణంగా ఆరు రాశులవారికి సమీప కాలంలో ధన బలం బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ నెల (మే) 14 తర్వాత నుంచి జూన్ మొదటి వారం వరకు కొన్ని రాశులకు షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం పెరగడం, రావలసిన సొమ్ము చేతికి అందడం, ఉద్యోగంలో జీతభత్యాలు వృద్ధి చెందడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలు మించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఇందులో వృషభం, కర్కాటకం, సింహం, కన్య, తుల, మకర రాశులున్నాయి.

వృషభం: ఈ రాశిలో బుధుడు, ధన స్థానంలో గురు, శుక్రులు సంచారం చేస్తున్న కారణంగా అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాలకు మించి ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. అంతేకాక, ఉద్యోగంలో జీతాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందడం వంటివి కూడా చోటు చేసుకుంటాయి. సిరిసంపదలకు లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది.

కర్కాటకం: ఈ రాశికి లాభ, వ్యయ స్థానాల్లో శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల విదేశీ సంపాదన అను భవించే యోగం పడుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆదాయ వృద్ధి మార్గాల మీద బాగా కృషి చేసి లబ్ధి పొందుతారు. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా కలుగుతాయి.

సింహం: ఈ రాశికి దశమ, లాభ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారికి ఆదాయం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి పూర్తిగా బయటపడతారు. లాభదాయక పరిచయాలు, లాభదాయక ప్రయాణాలతో బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి అందుతుంది. పిత్రార్జితం లభిస్తుంది.

కన్య: రాశ్యధిపతి బుధుడు, భాగ్యాధిపతి శుక్రుడు, ధన కారకుడు గురువు భాగ్య, దశమ స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి అపార ధన లాభం కలుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం పడుతుంది. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు స్థిరపడడంతో పాటు ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడం జరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాబడి పెరుగుతుంది.

తుల: శుభ గ్రహాల సంచారం కారణంగా భాగ్య స్థానం బలపడుతున్నందువల్ల ఈ రాశివారు ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కొత్త పుంతలు తొక్కుతారు. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో హోదాతో పాటు, జీతభత్యాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టి అత్యధికంగా లాభాలు పొందుతారు.

మకరం: ఈ రాశికి పంచమ, షష్ట స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల ఆదాయం వృద్ధి చెందడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలన్నీ దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆర్థికాభివృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి. ఈ రాశివారికి అత్యంత అరుదైన ధనాకర్షణ యోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంపాదన బాగా వృద్ధి చెందుతుంది. షేర్ల వ్యాపారం, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. విదేశీ సంపాదన యోగం కూడా పట్టే అవకాశం ఉంది.