
సాధారణంగా ఏ ఊళ్లో చూసినా ఒకటి లేదా రెండు ఆంజనేయ స్వామి ఆలయాలు ఉండటం సహజం. కానీ ఆ ఊరికి వెళ్తే మాత్రం అడుగడుగునా హనుమాన్ ఆలయాలే దర్శనమిస్తాయి. గల్లీకో గుడి.. ఇంటికో సంప్రదాయంలా ఏకంగా 50కి పైగా హనుమాన్ దేవాలయాలు కొలువైన ఆ అరుదైన గ్రామం విశేషాలు ఇప్పుడు చూద్దాం.

జగిత్యాల జిల్లా, మెట్పల్లి మండలం పరిధిలోని వెల్లూల గ్రామం ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. దాదాపు నాలుగు వేల జనాభా ఉన్న ఈ ఊరిలోకి అడుగుపెట్టగానే ఎటు చూసినా హనుమంతుడి ఆలయాలే కనిపిస్తాయి. పూర్వ కాలం నుంచి ఈ గ్రామంలో ఒక ప్రత్యేక ఆచారం కొనసాగుతోంది. ఇక్కడ పూర్వం నివసించిన బ్రాహ్మణ కుటుంబాలు, భక్తులు తమ కోరికలు నెరవేరినప్పుడల్లా స్వామివారిపై భక్తితో ఒక్కో ఆలయాన్ని నిర్మించుకుంటూ వచ్చారు.

అలా మొక్కుబడులు తీరడంతో కాలక్రమేణా ఊరంతా ఆలయాల మయంగా మారిపోయింది.ఈ గ్రామంలోని ప్రతి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అభయాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, గండి ఆంజనేయుడు, గణపతి ఆంజనేయుడు.. ఇలా ఒక్కో ఆలయంలో ఒక్కో విశిష్ట రూపంలో మారుతి భక్తులకు దర్శనమిస్తున్నాడు.

గల్లీకొక హనుమాన్ ఆలయం ఉన్నప్పటికీ, ఏ వీధి ప్రజలు ఆ గుడిలోనే నిత్యం దీపారాధనలు, పూజలు చేసుకుంటూ ఆలయాలను స్వయంగా సంరక్షించుకుంటున్నారు. ఇక హనుమాన్ చిన్న జయంతి, పెద్ద జయంతి వేడుకల సమయంలో వెల్లూల గ్రామమంతా కాషాయ వర్ణంతో మునిగిపోతుంది.

గ్రామంలో పెద్ద ఎత్తున హనుమాన్ దీక్షలు స్వీకరించడం, ఊరంతా 'జై శ్రీరామ్.. జై హనుమాన్' నినాదాలతో మార్మోగడం ఇక్కడి విశేషం. నిత్యాన్నదానాలు, అహోరాత్రుల భజనలు, సంకీర్తనలతో గ్రామమంతా ఒక పుణ్యక్షేత్రాన్ని తలపిస్తుంది. భక్తికి, మొక్కుబడుల నమ్మకానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన వెల్లూల గ్రామం నేడు రాష్ట్రవ్యాప్తంగా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.