
Ganesh Chaturthi Worldwide Celebrations Telugu: భారతదేశంలో గణేష్ చతుర్థి పండుగను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రజలు ఇళ్లను అందంగా అలంకరించి, గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 14 నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం కానున్న వేళ దేశవ్యాప్తంగా ఆలయాలు, వీధులు, ఇళ్లలో పండుగ సందడి కనిపిస్తుంది. అయితే గణేష్ చతుర్థి వేడుకలు కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచంలోని అనేక దేశాల్లోనూ హిందూ సమాజాలు ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నాయి. మరి గణేష్ చతుర్థిని ఏయే దేశాల్లో జరుపుకుంటారో తెలుసుకుందాం.

నేపాల్.. భారతదేశానికి పొరుగున ఉన్న నేపాల్‌లో కూడా గణేష్ చతుర్థిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. దేశంలో గణేశుడికి అంకితమైన అనేక ఆలయాలు ఉన్నాయి. గణేష్ చతుర్థి సందర్భంగా కాఠ్మండుతో పాటు ఇతర ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను సందర్శించి గణపతిని దర్శించుకుంటారు.

మారిషస్.. మారిషస్‌లో భారతీయ మూలాలు ఉన్న ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ముఖ్యంగా భోజ్‌పురి సంస్కృతి, భారతీయ సంప్రదాయాల ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. గణేష్ చతుర్థి సందర్భంగా ప్రజలు ఇళ్లలో, దేవాలయాల్లో గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో భజనలు, కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.

ఫిజీ.. ఫిజీలో కూడా భారతీయ సంతతికి చెందిన ప్రజలు గణేష్ చతుర్థిని జరుపుకుంటారు. ఆలయాలతో పాటు సామూహికంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గణపతి పూజతో పాటు భజనలు, కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పండుగను ఘనంగా జరుపుకుంటారు.

మలేషియా.. మలేషియాలో భారతీయ సంతతికి చెందిన హిందువులు గణేష్ చతుర్థిని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. వివిధ హిందూ దేవాలయాల్లో గణపతికి ప్రత్యేక పూజలు, అలంకరణలు చేస్తారు. పండుగ సందర్భంగా భక్తులు ఆలయాలకు చేరుకుని గణేశుడిని దర్శించుకుంటారు.

సింగపూర్.. సింగపూర్‌లోనూ గణేష్ చతుర్థికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అక్కడి హిందూ దేవాలయాల్లో గణపతి పూజలు, భజనలు, కీర్తనలు, ఇతర మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా జరుగుతాయి.

ఇండోనేషియా.. ఇండోనేషియాలో భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయాల చారిత్రక ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా జావా ప్రాంతంలోని బ్రోమో అగ్నిపర్వత సమీపంలో గణేశుడి పురాతన విగ్రహం ఉంది. స్థానికులు ఈ విగ్రహాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. గణేశుడిని అక్కడ రక్షక దేవుడిగా భావించే సంప్రదాయం కూడా ఉంది.

అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా.. ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ గణేష్ చతుర్థి వేడుకలు క్రమంగా విస్తరిస్తున్నాయి. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో నివసించే భారతీయులు, ఇతర హిందూ సమాజాలు గణేష్ చతుర్థిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయా దేశాల్లోని హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.

అంటే.. గణేష్ చతుర్థి భారతదేశంలో పుట్టిన గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయంగా ఉండటమే కాకుండా.. ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు, హిందూ సమాజాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలోనూ జరుపుకునే పండుగగా మారింది. దేశం మారినా.. గణపతిపై భక్తి, విశ్వాసం మాత్రం ఒకటే అన్నట్టుగా ఈ వేడుకలు కొనసాగుతున్నాయి.