
తురిమిన బెల్లం: ముప్పావు కప్పు, నీళ్లు: ఒక కప్పు, తురిమిన పచ్చి కొబ్బరి: 1/3 కప్పు, బియ్యం పిండి: ఒక కప్పు (పొడి లేదా తడి బియ్యం పిండి), నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: చిటికెడు, యాలకుల పొడి: పావు టీ స్పూన్

బెల్లం కుడుముల కోసం ముందుగా బెల్లం సిరప్ తయారు చేసుకోవాలి. దీని కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి, అందులోకి ముప్పావు కప్పు తురిమిన బెల్లం, ఒక కప్పు నీళ్లు వేయాలి. మంటను మీడియం నుంచి హై ఫ్లేమ్‌లో ఉంచి, బెల్లాన్ని కలుపుతూ పూర్తిగా కరగనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత, ఆ బెల్లం నీటిని వడ కట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది బెల్లంలోని మలినాలను తొలగిస్తుంది.

ఇప్పుడు అదే కడాయిని తిరిగి స్టవ్ మీద పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత, 1/3 కప్పు తురిమిన పచ్చి కొబ్బరిని వేసి, చిన్న మంట మీద నిదానంగా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించాలి. ఇది కుడుములకు మంచి రుచిని, సువాసనను ఇస్తుంది. ఇక కొబ్బరి వేగిన తర్వాత, ముందుగా వడకట్టుకున్న బెల్లం నీటిని ఇందులో పోయాలి. చిటికెడు ఉప్పు, పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించాలి. మంటను లో ఫ్లేమ్‌లోకి తగ్గించి, ఒక కప్పు బియ్యం పిండిని నెమ్మదిగా వేస్తూ గరిటతో ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. పిండి బాగా దగ్గరపడి, గట్టి ముద్దలా మారే వరకు కలుపుతూ ఉడికించాలి.

పిండి ముద్దలా మారిన తర్వాత స్టవ్ ఆపి, కడాయిని పక్కన పెట్టుకోవాలి. దానిపై మూత పెట్టి, పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. పిండి చల్లారిన తర్వాత, చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, పిండి మొత్తాన్ని బాగా నలుపుతూ మెత్తగా, ఒక ముద్దలా చేసుకోవాలి. ఇది కుడుములు మృదువుగా రావడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్ద నుంచి చిన్న చిన్న భాగాలుగా తీసుకుని, గుండ్రని ఉండలుగా చుట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్కటి తీసుకుని, మీకు నచ్చిన ఆకారంలో కుడుములుగా ఒత్తుకోవాలి. చేతితో కాస్త నొక్కుతూ ముట్టీల ఆకారంలో కూడా చేసుకోవచ్చు.

అన్ని కుడుములను తయారు చేసుకున్న తర్వాత, వాటిని ఆవిరి మీద ఉడికించాలి. ఇడ్లీ స్టీమర్‌ను స్టవ్ మీద పెట్టి, అందులో నీళ్లు పోసి వేడి చేయాలి. స్టీమర్ ప్లేట్‌లకు లేదా ఇడ్లీ ప్లేట్‌లకు కొద్దిగా నెయ్యి రాసి, తయారు చేసుకున్న కుడుములను వరుసగా పేర్చుకోవాలి. మూత పెట్టి, మీడియం ఫ్లేమ్‌లో పది నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. పది నిమిషాల తర్వాత స్టవ్ ఆపి, వెంటనే బయటకు తీయకుండా, మరో ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. అంతే రుచికరమైన బెల్లం కుడుములు రెడీ