
జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధ, రవులు కలవడం ఒక విశిష్ట యోగం. బుధాదిత్య యోగమనీ, సూక్ష్మ బుద్ధి యోగమనీ వ్యవహరించే ఈ యోగం వల్ల ప్రధానంగా తెలివితేటలు చురుకుగా పని చేయడం, నైపుణ్యాలు వృద్ధి చెందడం, వ్యవహార శైలి మెరుగుపడడం, సమస్యల్ని పరిష్కరించుకోవడం వంటివి జరుగుతాయి. ఈ నెల (జూన్) 16 నుంచి ఆరు రోజుల పాటు మిథున రాశిలో బుధ, రవుల యుతి జరుగుతోంది. బుధుడికి స్వస్థానమైనందువల్ల ఈ రాశిలో బుధాదిత్య యోగం మరింత ప్రబలంగా పనిచేస్తుంది. వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, ధనూ రాశుల వారికి అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది.

వృషభం: ఈ రాశికి ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల ఆర్థిక స్థితి బాగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా ఆదాయం గడించడం జరుగుతుంది. ఉద్యోగంలో హోదా, జీతభత్యాలు బాగా పెరుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అదనపు రాబడి కూడా అంచనాలకు మించి పెరుగుతుంది. కొన్ని కుటుంబ సమస్యలు పరిష్కారమై, మనశ్శాంతి కలుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది.

మిథునం: ఈ రాశిలో రాశ్యధిపతి బుధుడితో రవి కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది. దీని వల్ల రాజయోగాలు, ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. జీవనశైలి ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఆర్థిక పరం గానే కాక, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా హోదా పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు.

సింహం: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి రవితో బుధుడు కలవడం వల్ల ఉద్యోగంలో ఉన్నత పదవి లభిస్తుంది. ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో ఊహించని పురోగతి కలుగుతుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ పెరగడంతో పాటు అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆశించిన శుభ వార్తలు వింటారు.

కన్య: ఈ రాశికి దశమ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో రవి కలవడం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి లాభం కలుగుతుంది. సామాజికంగా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి శుభవార్తలు అందుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు లభిస్తాయి. ఉద్యోగం మారడానికి ఇది అనుకూల సమయం. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల అనేక విధాలుగా అదృష్టం తలుపు తడుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయాలు సాధిస్తారు. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కా రమవుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. విదేశీమూలక ధన లాభం ఉంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు శుభ వార్తలు వింటారు. తల్లితండ్రుల నుంచి విలువైన ఆస్తి లభిస్తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

ధనుస్సు: ఈ రాశివారికి సప్తమ స్థానంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు గడించే అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నమైనా సత్ఫలితాలనిస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమవుతుంది. సహోద్యోగితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంటుంది. భాగస్వామ్య వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.