
వృషభం: ఈ రాశికి భాద్రపద మాసమంతా ఆదాయపరంగా, అధికారపరంగా మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. తృతీయ స్థానంలో కుజుడు, పంచమంలో రవి వీరిని కొద్ది ప్రయత్నంతో అందలాలు ఎక్కిస్తాయి. ఈ నెల 12 తర్వాత ధన యోగాలు, రాజయోగాలు కలుగుతాయి. ఉద్యో గంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఉన్నత పదవి లభించే ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీ అవుతాయి.

కర్కాటకం: ఈ రాశికి భాద్రపద మాసమంతా నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. రవి, కుజుల అను కూలత ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. వృత్తి, ఉద్యో గాలరీత్యా తరచూ విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి.

సింహం: రాశ్యధిపతి రవి ధన స్థానంలో ప్రవేశించడం, కుజుడు వ్యయస్థానంలోసంచారం చేయడం వల్ల భాద్ర పద మాసంలో ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ సంపాదన యోగం పడు తుంది. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సిద్ధిస్తాయి. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు జోరందుకుంటాయి. ఉద్యోగంలో తప్పకుండా హోదా పెరుగుతుంది.

తుల: ఈ రాశికి దశమ స్థానంలో కుజుడు, వ్యయ స్థానంలో రవి ప్రవేశం వల్ల విదేశీ ఆఫర్లు ఎక్కువగా అందే అవకాశం ఉంది. భాద్రపద మాసమంతా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయాలు సాధి స్తారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరగడంతో పాటు రాబడి కొత్త పుంతలు తొక్కుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగరీత్యా తరచూ ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది.

వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో, రవి లాభస్థానంలో సంచారం వల్ల ఈ రాశివారికి భాద్రపద మంతా విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి లభి స్తుంది. ఉన్నత పదవికి అవకాశమున్న ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు తప్పకుండా ఆశించిన ఆఫర్లు అందుతాయి. విదేశీయానానికి మార్గం సుగమమవుతుంది. ఆదాయానికి లోటుండదు.

మకరం: ఈ రాశికి కుజ, రవుల బలం వల్ల భాద్రపద మాసమంతా ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించి ప్రభుత్వ ఉన్నతోద్యోగం సంపాదించడా నికి కూడా అవకాశం ఉంది. విదేశీ సొమ్మును అనుభవించే అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు, విదేశీ ప్రయాణాలు సానుకూలపడతాయి. తండ్రి వైపు నుంచి సహాయ సహకారాలు పెరగడమే కాక, సంపద కూడా లభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి.