
తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుపై పూర్వ విద్యార్థులు వినూత్న రీతిలో గురుభక్తిని చాటుకున్నారు. పదేళ్లపాటు తమకు ఇంగ్లీష్ పాఠాలు బోధించిన లెక్చరర్ పదవీ విరమణ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా కలిసి ఆయనకు టాటా ఎలక్ట్రిక్ కారును బహుమతిగా అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కరీంనగర్‌లోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (DIET)లో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేసిన గుర్రం మహేశ్వర్ రెడ్డి పదవీ విరమణ పొందారు. 2014 నుంచి 2024 వరకు ఆయన వద్ద విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమ జీవితాల్లో గురువు అందించిన మార్గదర్శకత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు ఎప్పటికీ గుర్తుండిపోయే కానుక ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో పూర్వ విద్యార్థులంతా కలిసి టాటా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసి మహేశ్వర్ రెడ్డికి బహుమతిగా అందించారు. ఇందులో యూట్యూబర్ అనిల్‌తో పాటు పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

కారు అందజేసిన అనంతరం పూర్వ విద్యార్థులు తమ గురువును వేదికపైకి ఎత్తుకుని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. విద్యార్థులు చూపిన ఆత్మీయతకు మహేశ్వర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గురువుకు విద్యార్థుల నుంచి లభించిన ఈ అరుదైన గౌరవాన్ని చూసి అక్కడున్న వారంతా ఆనందం వ్యక్తం చేశారు.

పూర్వ విద్యార్థుల కరతాళ ధ్వనుల మధ్య మహేశ్వర్ రెడ్డిని కొత్త కారులో ఇంటికి సాగనంపారు. గురువు-శిష్యుల అనుబంధానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. తమకు విద్యతో పాటు జీవితంలో ముందుకు సాగేందుకు మార్గనిర్దేశం చేసిన గురువుకు పూర్వ విద్యార్థులు ఈ కానుక అందించి అందరి ప్రశంసలు పొందారు.