
నైరుతి రుతుపవనాలు 2026 జూలై 9 నాటికి ఉత్తర అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. దీంతో 2026 జూలై 9 నాటికి దేశమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. సాధారణంగా దేశమంతటా రుతుపవనాలు విస్తరించే తేదీ జూలై 8 కాగా, ఈ ఏడాది ఒక రోజు ఆలస్యంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి.

వాయువ్య మధ్యప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న నైరుతి ఉత్తరప్రదేశ్‌పై ఉన్న స్పష్టంగా ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, ఈరోజు (2026 జూలై 9) ఉదయం 8:30 గంటల (IST) నాటికి నైరుతి ఉత్తరప్రదేశ్, పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న చక్రవాత ప్రసరణ సముద్ర మట్టానికి సుమారు 7.6 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో నెమ్మదిగా ఈశాన్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.

సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి (Monsoon Trough) అనూప్‌గఢ్, రోహ్తక్, నైరుతి ఉత్తరప్రదేశ్‌పై ఉన్న స్పష్టంగా ఏర్పడిన అల్పపీడన కేంద్రం, ఫుర్సత్‌గంజ్, డెహ్రీ, ధన్‌బాద్, బంకురా, దీఘా మీదుగా సాగి, అక్కడి నుంచి తూర్పు-ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో తెలుంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల మూడు రోజులకు వాతావరణ సూచన (FORECAST FOR NEXT 3 DAYS)లు ఈ కింది విధంగా ఉన్నాయి..

09-07-2026 గురువారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. శుక్రవారం (10-07-2026) తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. శనివారం (11-07-2026) తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రాగల మూడు రోజులకు వాతావరణ హెచ్చరికలు (WARNINGS FOR NEXT 3 DAYS): తెలంగాణ రాష్ట్రంలో గురువారం గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు (Strong surface winds) వీచే అవకాశం ఉంది. శుక్రవారం, శనివారం తెలంగాణ రాష్ట్రంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.