
గోదావరి తీరాన వినాయక చవితి వేడుకలు ఎంతో భక్తిశ్రద్ధలతో, కన్నులపండువగా ముగిశాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలోని శ్రీరామపురం వీధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుడి నిమజ్జనోత్సవం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక కళాకారులు రూపొందించిన వినూత్న అలంకరణలు, శోభాయాత్ర వేడుకలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది రంగురంగుల సహజ సిద్ధమైన పూలతో తీర్చిదిద్దిన అలంకరణలే. వివిధ రకాల పుష్పాలను మేళవించి అమ్మవారి దివ్య ముఖరూపాన్ని అద్భుతమైన నైపుణ్యంతో ఆవిష్కరించారు. ఈ పుష్పాలంకరణ భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది.

ఊరేగింపు కోసం ఎరుపు రంగు పుష్పాలతో రూపొందించిన ప్రత్యేక డ్రాగన్ ఆకృతి రథం స్థానికులను, చిన్నారులను విశేషంగా అలరించింది.అలాగే ఆధునిక క్రియేటివిటీని ప్రతిబింబిస్తూ పూలతో తీర్చిదిద్దిన నేపథ్య అలంకరణలు ఊరేగింపునకు ప్రత్యేక వైభవాన్ని తెచ్చిపెట్టాయి.

అదేవిధంగా నిర్వహించిన వినాయకుడి ఊరేగింపు కాకరపర్రు పురవీధుల్లో అత్యంత కోలాహలంగా సాగింది. సంప్రదాయ డప్పు వాయిద్యాలు, కంజేర చప్పుళ్ళు, బ్యాండ్ మేళాలు, బాణసంచా వెలుగుల నడుమ యువత, గ్రామస్థులు భక్తిపారవశ్యంతో పాల్గొన్నారు. కళాకారుల శూలాల వేషధారణలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

గ్రామ వీధుల్లో ఊరేగిన అనంతరం, ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి గణనాథుడిని పవిత్ర గోదావరి నదిలో శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. భక్తి, కళానైపుణ్యం కలగలిసిన ఈ వేడుకలు కాకరపర్రు గ్రామ సంస్కృతిని, ఐక్యతను చాటిచెప్పాయి.