
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక స్పష్టమైన అల్పపీడన ప్రాంతం కొనసాగుతోందని.. ఇది వాయువ్య దిశగా కదులుతూ కొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆదివారం వాయుగుండంగా బలపడి.. సోమవారం ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. తుఫాన్‌గా మారాక అక్వాన్‌గా నామకరణం చేయనున్నారు. బుధవారం 18న ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఈ నెల 18 నుంచి ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ..

తుఫాన్ 20వ తేదీన తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాన్ గమనం ఉత్తర కోస్తా వైపు ఉండే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. తుఫాన్ ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే క్రమంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తుఫాన్ ఫలితంగా, గురువారం, శుక్రవారం ఉత్తర ఆంధ్రలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి. కోస్తాంధ్రలో వరి పంట కోతకు సిద్ధంగా ఉన్న రైతులు నవంబర్ 18వ తేదీలోపు వెంటనే కోతలు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నాను.

ఈనెల 16 నుంచి తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తీరాలకు చేరుకోవాలని సూచించారు.

తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో నవంబర్ 19 నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని పేర్కొంది.