
Pakistan Ball Tampering History: పాకిస్థాన్ క్రికెట్ హిస్టరీలో బాల్ టాంపరింగ్ కూడా ఓ భాగమైంది. పాక్ క్రికెటర్ల తీరుతో ఆ జట్టు పాలిట మాయని మచ్చలా మారింది. రివర్స్ స్వింగ్ రాబట్టే క్రమంలో "బంతిని మేనేజ్ చేయడం", "నిబంధనలను ఉల్లంఘించడం" మధ్య ఉన్న రూల్స్ ను పాక్ ఆటగాళ్లు తరచూ బ్రేక్ చేస్తూనే ఉన్నారు. మార్చి 29, 2026న పీఎస్ఎల్ (PSL) మ్యాచ్‌లో ఫఖర్ జమాన్ ఉదంతం మరోసారి పాత గాయాలను తెరపైకి తీసుకొచ్చింది.

1. వకార్ యూనిస్ (2000): అంతర్జాతీయ స్థాయిలో తొలి నిషేధం: బాల్ టాంపరింగ్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌లో నిషేధానికి గురైన తొలి ఆటగాడిగా వకార్ యూనిస్ రికార్డుకెక్కాడు. 2000 శ్రీలంకలో జరిగిన వన్డేలో సౌత్ ఆఫ్రికాతో ఆడుతున్నప్పుడు, వకార్ తన గోళ్లతో బంతి సీమ్‌ను మార్చడానికి ప్రయత్నించాడు. ఈ వ్యవహారం కెమెరాకు చిక్కడంతో సంచలనంగా మారింది. దీనివల్ల ఆయనపై ఒక మ్యాచ్ నిషేధంతోపాటు 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించారు.

2. అజర్ మహమూద్ (2000): వకార్‌తో పాటు శిక్ష: ఇదే మ్యాచ్ లో మరో పాక్ ప్లేయర్ కూడా శిక్షకు గురయ్యాడు. వకార్ యూనిస్ బంతిని గోళ్లతో గీకుతున్న సమయంలో అజర్ మహమూద్ అతనికి సహకరించినట్లు తేలింది. దీంతో అజర్‌కు 30 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించారు. అలాగే, అప్పటి పాకిస్తాన్ జట్టు కెప్టెన్ మోయిన్ ఖాన్‌ను కూడా మ్యాచ్ రెఫరీ తీవ్రంగా హెచ్చరించారు.

3. షోయబ్ అక్తర్ (2002, 2003): బాహాటంగానే ఒప్పుకోలు: 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' షోయబ్ అక్తర్ కెరీర్‌లో రెండుసార్లు అధికారికంగా బాల్ టాంపరింగ్ శిక్షను అనుభవించడం గమనార్హం. 2002లో జింబాబ్వేపై, 2003లో శ్రీలంకతో మ్యాచ్ ల సదర్భంగా అడ్డంగ బుక్కయ్యాడు. విచిత్రమేమిటంటే, 2011లో విడుదలైన తన ఆత్మకథ 'కాంట్రవర్షియల్లీ యువర్స్'లో బంతిని కావాలనే టాంపరింగ్ చేసినట్లు అక్తర్ బహిరంగంగానే అంగీకరించాడు.

4. షాహిద్ అఫ్రిది (2010): బంతిని కొరికిన వింత ఘటన: క్రికెట్ హిస్టరీలో అత్యంత వింతైన బాల్ టాంపరింగ్ ఘటన షాహిద్ అఫ్రిదిది. 2010లో ఆస్ట్రేలియాపై జరిగిన వన్డేలో అఫ్రిది బంతిని నోటితో కొరుకుతూ కెమెరాకు దొరికిపోయాడు. అప్పట్లో ఆయన "నేను బంతిని వాసన చూస్తున్నాను" అని చెప్పడం హాస్యాస్పదంగా మారింది. దీనికి శిక్షగా ఆయనపై రెండు టీ20ల నిషేధం విధించారు.

5. ఇమ్రాన్ ఖాన్ (1994): బాటిల్ మూతతో ప్రయోగం: పాకిస్థాన్ మాజీ ప్రధాని, దిగ్గజ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ వివాదంలో చిక్కుకున్నాడు. 1981లో ఒక కౌంటీ మ్యాచ్‌లో బంతిని గీకడానికి తాను బాటిల్ మూతను ఉపయోగించానని 1994లో తన ఆత్మకథలో వెల్లడించాడు. రివర్స్ స్వింగ్ కోసం ఆ రోజుల్లో ఇది సర్వసాధారణమని ఆయన సమర్థించుకున్నాడు.

6. ఫఖర్ జమాన్ (2026): పీఎస్ఎల్ లో తాజా ఉదంతం: మార్చి 29, 2026న లాహోర్ ఖలందర్స్ వర్సెస్ కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫఖర్ జమాన్ లెవల్ 3 నేరానికి పాల్పడ్డాడు. చివరి ఓవర్‌లో బంతి ఆకారాన్ని మార్చినందుకు అంపైర్లు కరాచీ కింగ్స్‌కు 5 పెనాల్టీ పరుగులను కేటాయించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది, త్వరలోనే ఫఖర్ జమాన్‌పై నిషేధం విధించే అవకాశం ఉంది.