
తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకుంటూ, 1982 నుండి 2000 వరకు తాను ఒక ఆటోమొబైల్ షాప్‌లో ఉద్యోగం చేశానని చెప్పారు. 1980లో తన జీతం 90 రూపాయలు మాత్రమే అని, 1985 నాటికి 200 రూపాయలకు పెరిగిందని తెలిపారు. ఆ తర్వాత 350 రూపాయల జీతానికి ఆఫీస్ బాయ్‌గా మారి, క్రమంగా జూనియర్ క్లర్క్‌గా, సీనియర్ క్లర్క్‌గా పదోన్నతి పొంది, 2000 సంవత్సరంలో ఉద్యోగం మానేసేటప్పటికి 2775 రూపాయలు సంపాదించేవారని వివరించారు. 2000 సంవత్సరం నుండి 2013 వరకు సినీ రంగంలో అవకాశాల కోసం తీవ్రంగా పోరాడారు. నెలకు పది వేల రూపాయలు కూడా సంపాదించలేని స్థితిలో తన భార్య లక్ష్మి టీచర్‌గా పనిచేస్తూ, ప్రైవేట్లు చెప్పుకుంటూ కుటుంబాన్ని పోషించిందని చెప్పారు.

"నువ్వు ప్రస్తుతానికి ఇలా ఉండు, నాకు కొద్దిగా సమయం ఇవ్వు. అదృష్టం కలిసొస్తే ఇక్కడ ఉంటాను, లేకపోతే తిరిగి ఇంటికి వస్తాను" అని భార్యకు చెప్పి, 2013 డిసెంబర్ 31 వరకు తనకు తాను గడువు విధించుకున్నట్లు అప్పారావు పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో బొమ్మలాట సారిక అనే సీనియర్ స్టేజ్ ఆర్టిస్ట్, ఆమె కుటుంబం తనకు ఎంతో మద్దతుగా నిలిచి, అయిదేళ్ళ పాటు అద్దె లేకుండా తనను ఆశ్రయం కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు. 2013 డిసెంబర్ తర్వాత శకలక శంకర్ ద్వారా జబర్దస్త్‌లో అవకాశం రావడం తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని అప్పారావు అన్నారు. "జబర్దస్త్ నాకు ఏది అయినా సరే. సినిమా నాకు బ్రేక్ ఇవ్వలేదు. జబర్దస్త్ ఇచ్చింది. జబర్దస్త్ ద్వారా సినిమాలు వచ్చాయి" అని ఆయన అన్నారు.

జబర్దస్త్ అప్పారావు అలాగే రెబెల్ స్టార్ ప్రభాస్‌తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనదైన శైలి నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న అప్పారావు, ఎంత ఎదిగినా నిరాడంబరంగా ఉండడమే తన విజయ రహస్యమని చెబుతారు. ప్రభాస్ హీరో కాకముందే, అప్పారావు వారి గురువు సత్యానందం గారి వద్ద నటనలో మెలకువలు నేర్చుకుంటున్నప్పుడు ఇద్దరూ కలిసి ఇంప్రవైజేషన్స్ చేసేవారని అప్పారావు గుర్తు చేసుకున్నారు.

తరువాత చక్రం సినిమా కోసం ప్రభాస్‌కు కోచింగ్ ఇస్తున్నప్పుడు, తాను గురువుగారికి అసిస్టెంట్‌గా పనిచేశానని తెలిపారు. ప్రభాస్ స్టార్ అయిన తర్వాత అప్పారావుని కేవలం మూడుసార్లే కలిశారట. బిల్లా చిత్రం సమయంలో ఒకసారి, ఆ తర్వాత రాధేశ్యామ్ డబ్బింగ్ పనుల నిమిత్తం కవూరి హిల్స్‌లోని బిల్డింగ్‌లో కలిసినప్పుడు, ప్రభాస్ ఎంతో గౌరవంగా పలకరించారని అప్పారావు చెప్పారు. సోఫాలో కూర్చున్న ప్రభాస్, అప్పారావుని చూడగానే లేచి నిలబడి, కౌగిలించుకుని, కూర్చోమని చెప్పి, టీ, కాఫీ ఇప్పించడమే కాకుండా, వారి కుటుంబ యోగక్షేమాలు అడిగారని అప్పారావు ఎంతో ఆనందంగా వివరించారు.

గురువు సత్యానందం గారిని ఎంత గౌరవిస్తారో, తనను కూడా ప్రభాస్ అంతే గౌరవించారని అప్పారావు పేర్కొన్నారు. అప్పారావు తన సినీ ప్రస్థానంలో పెద్ద హీరోలతో సంభాషణలు చాలా తక్కువని తెలిపారు. రావు రమేష్ వంటి వారు ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడారని చెప్పారు. గోవిందుడు అందరివాడేలే సినిమాలో రామ్ చరణ్ తన భుజంపై చెయ్యేసి కొద్దిసేపు మాట్లాడారని, అయితే ఆ సినిమాలో తన క్యారెక్టర్ చివరికి కట్ చేయబడిందని ఆయన గుర్తు చేసుకున్నారు.