
దీపావళి పండక్కి మరో కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో పండుగ సెలవుల కారణంగా చాలామంది తమ సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో రైళ్లల్లో భారీగా రద్దీ ఏర్పడనుంది. ఈ రద్దీని నియంత్రించేందుకు రైల్వేశాఖ పలు మార్గాల్లో ప్రత్యేక రైలు సర్వీసులను తీసుకొస్తోంది. అయితే రైళ్లల్లో అప్పటికప్పుడు వెళ్లాలంటే కన్ఫార్మ్డ్ టికెట్లు లభించవు. దీంతో ఇంటికెళ్లాలనుకునేవారు ముందుగానే టికెట్లను బుక్ చేసుకువాల్సి ఉంటుంది.

కొంతమంది ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకుంటుంటే.. మరికొంతమంది రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టికెట్ పొందుతున్నారు. కొన్నిసార్లు రైళ్లల్లో బెర్త్‌లు ఖాళీగా లేనప్పుడు టికెట్లు వెయిటింగ్ లిస్టులో పడతాయి. కన్ఫార్మ్ టికెట్లు పొందినవారు క్యాన్సిల్ చేసుకుంటే ఆ టికెట్లను వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు ప్రాధాన్యత క్రమంలో సిస్టమ్ ఆటోమేటిక్‌గా కేటాయిస్తుంది. టికెట్ కన్పామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందనే ఆశలో చాలామంది వెయిటింగ్ టికెట్లను కూడా కొనుగోలు చేస్తుంటారు.

అయితే ఆన్లైన్లో కంటే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా బుక్ చేసుకునే వెయిటింగ్ టికెట్లకు కన్ఫార్మ్ అయ్యేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే అపోహ చాలామందిలో ఉంది. రైల్వేశాఖ నిబంధనల ప్రకారం అలాంటి రూల్ ఏమీ లేదు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ టికెట్లను సమానంగా భావిస్తారు. ఎలా బుక్ చేసుకున్న వివక్ష అనేది ఉండదు. వెయిటింగ్ లిస్టు టికెట్లు కన్ఫార్మ్ అయ్యేందుకు ఎక్కడ కొనుగోలు చేశారనేది పరిగణలోకి తీసుకోరు.

వెయిటింగ్ లిస్ట్ రకంపై టికెట్ కన్ఫర్మేషన్ అనేది ఆధారపడింది. జనరల్ వెయిటింగ్ టికెట్ల కన్పార్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రిమోట్ లొకేషన్, తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ కన్పర్మేషన్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. జనరల్, సీనియర్ సిటిజన్, మహిళా కోటాలో టికెట్ బుక్ చేసుకున్నారా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఆన్లైన్,ఆఫ్‌లైన్ ఏ విధానంలో బుక్ చేసుకున్నా పెద్దగా తేడా అనేది ఉండదు.

ఆన్లైన్లో బుక్ చేసుకున్న వెయిటింగ్ లిస్ట్ టికెట్లు చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా కన్పార్మ్ అవ్వకపోతే ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయి. టికెట్ ఛార్జీ మీకు రీఫండ్ అందుతుంది. దీంతో ఆ టికెట్‌పై ప్రయాణించడానికి అనుమతి ఉండదు. కౌంటర్ టికెట్ల విషయానికొస్తే.. అన్‌రిజర్వుడ్ కంపార్ట్మెంట్లలో ఆ టికెట్‌తో ప్రయాణించవచ్చు.