
ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ కావాలంటే చాలా ప్రాసెస్ ఉండేది. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, కరెంట్ బిల్లు లాంటివి సమర్పించాల్సి వచ్చేది. సెక్యూరిటీ డిపాజిట్, గ్యాస్ కనెక్షన్, ఇతర ఫీజులు చెల్లిస్తే మీ పేరుపై గ్యాస్ కనెక్షన్ అందిస్తారు. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే ఇంటికి డెలివరీ అవుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది.

కానీ ఇక నుంచి గ్యాస్ కనెక్షన్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అడ్రస్ ప్రూఫ్ కూడా అక్కర్లేదు. కేవలం ఏదైనా గుర్తింపు ధృవీకరణ పత్రం చూపించి గ్యాస్ సిలిండర్ నిమిషాల్లోనే పొందవచ్చు. హెచ్‌పీ, భారత్ గ్యాస్, ఇండేన్ గ్యాస్ 5 కేజీ మినీ గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ సిలిండర్లు తీసుకోవాలంటే సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లాలి. ఆధార్, పాన్ లాంటి ఏదైనా గుర్తింపు ధృవీకరణ పత్రం చూపించి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తే సిలిండర్ అందిస్తారు.

ఇక భారత్ గ్యా్స్ సిలిండర్ కావాలంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800224344కు ఫోన్ చేసి కూడా 5 కేజీల సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2 గంటల్లోనే మీ ఇంటికి సిలిండర్ డెలివరీ చేస్తారు. ఇక ఇండేన్ గ్యాస్ సిలిండర్‌ను మీ సమీపంలోని కిరాణా దుకాణాలు లేదా రిటైల్ అవుట్‌లెట్లలో పొందవచ్చు. ఇక హెచ్‌పీ 5 కేజీల సిలిండర్‌ను పెట్రోల్ పంప్స్, రిటైల్ అవుట్‌లెట్లలో పొందవచ్చు. ఇక వాట్సప్, కంపెనీల పోర్టల్, వాట్సప్, మిస్డ్ కాల్, ఐవీఆర్ఎస్ విధానాల్లో రీఫిల్ కోసం బుక్ చేసుకోవచ్చు.

5 కేజీల సిలిండర్ కోసం సెక్యూరిటీ డిపాజిట్, సిలిండర్, రెగ్యూలేటర్‌తో కలిసి రూ.1300 నుంచి రూ.1500 వరకు ఖర్చు అవుతుంది. రూ.1100 నుంచి రూ.1200 వరకు సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. మీరు సిలిండర్ తిరిగి అందిస్తే సెక్యూరిటీ డిపాజిట్ వెనక్కి ఇచ్చేస్తారు. చాలాకాలం పాటు గ్యాస్ సిలిండర్ అవసరం లేదనుకుంటే సిలిండర్ సరెండర్ చేసి సెక్యూరిటీ డిపాజిట్ పొందవచ్చు. బ్యాచిలర్స్, వలస కార్మికులకు ఈ సిలిండర్ బాగా ఉపయోగపడుతుంది.

అద్దె ఇళ్లల్లో ఉండేవారు, విద్యార్థులు, ఒంటరి వ్యక్తులు, చిన్న కుటుంబాలవారికి 5 కేజీల సిలిండర్ ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కనెక్షన్ ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ అవసరం ఉండదు. అంతకాకుండా అవసరం తీరిపోయాక సిలిండర్ వెనక్కి ఇచ్చేయ్యవచ్చు. దీంతో ఈసిలిండర్లకు మంచి డిమాండ్ ఉంది.