
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త అందించింది. 10 కేజీల గ్యాస్ సిలిండర్లను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం వాణిజ్య అవసరాల కోసం 19 కేజీల సిలిండర్, డొమెస్టిక్ ప్రయోజనాల కోసం 14.2 కేజీల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇటీవల 5 కేజీల సిలిండర్లను కూడా కేంద్రం కొత్తగా ప్రారంభించింది. త్వరలో 10 కేజీల సిలిండర్లను కూడా ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది.

ఈ మేరకు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వాణిజ్య వినియోగదారులకు ఈ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురానున్నాయి. 10 కేజీల ఎల్పీజీ కాంపోజిట్ సిలిండర్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సిలిండర్లను గ్యాస్ ఏజెన్సీలు, రిటైల్ అవుట్‌లెట్లలో వాణిజ్య ధరలకే అందుబాటులో ఉంచనున్నారు. దీనివల్ల వలస కార్మికులు, అద్దెదారులు, విద్యార్థులు, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపార సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. ఇవి సాధారణ స్టీల్ సిలిండర్ల కంటే సుమారు 50 శాతం తేలికగా ఉంటాయి.

ప్రస్తుతం ఈ సిలిండర్లు గృహ వినియోగదారుల కోసం పరిమిత స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇప్పుడు వాణిజ్య వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సిలిండర్లు చాలా తేలికగా ఉండటం వల్ల వీటిని ఎత్తడం, రవాణా చేయడం చాలా సులభంగా ఉంటుంది. వీటిని వాణిజ్య ధరలకు విక్రయిస్తారు

ప్రస్తుతం రెస్టారెంట్లు, హోటల్స్, ఇతర వాణిజ్య వ్యాపారుల కోసం 19 కేజీలు, 5 కేజీలు, 2 కేజీల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. 10 కేజీల సిలిండర్ తక్కువ గ్యాస్ అవసరాలు ఉన్న చిన్న వ్యాపారాలకు ఉపయోగపడనుంది. వీధి వ్యాపారులు, చిన్న టీ, ఆహార దుకాణాలు నడిపేవారికి ఇది బాగా యూజ్ అవుతుంది. 19 కిలోల పెద్ద సిలిండర్‌ను నిల్వ చేయడానికి స్థలం ఉండదు. అయితే తేలికైన కాంపాక్ట్ సిలిండర్ తక్కువ స్థలంలో సులభంగా సరిపోతుంది

అలాగే ఈ సిలిండర్లను అవసరమైన చోటకు సులభంగా తీసుకెళ్లవచ్చు. ఈ సిలిండర్లను ఆధునిక కాంపోజిట్ టెక్నాలజీతో తయారుచేస్తారు. వీటికి మూడు పొరల నిర్మాణం ఉంటుంది. ఇది సాధారణ స్టీల్ ఎల్పీజీ సిలిండర్ కంటే సుమారు 50 శాతం తేలికగా ఉంటుంది. దీనిని ఎత్తడం, మోయడం చాలా సులభంగా ఉంటుంది.