
వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ చేస్తామని వెల్లడించింది. ఎల్పీజీ ఉత్పత్తిని 25 శాతం పెంచామని బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. హార్ముజ్ జలసంధితో సంబంధం లేని రూట్ల ద్వారా చమురు దిగుమతి చేసుకున్నట్లు తెలిపింది.

హార్ముజ్ నుంచి ఆగిపోయిన సప్లై కంటే ఎక్కువ చమురునే సేకరించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. త్వరలోనే ఇవి దేశానికి రానున్నాయని, గ్యాస్ కొరత ఉండదని తెలిపింది. గృహ వినియోగదారులకు గ్యాస్ బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోనే పంపిణీ చేస్తామని పేర్కొంది. గ్యాస్ గురించి ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తెలిపింది.

అయితే గృహ అవసరాలకు సిలిండర్లను పంపిణీ చేసేందుకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మేరకు గ్యాస్ డెలివరీ చేసే కంపెనీలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. మరోవైపు వాణిజ్య సిలిండర్ల పంపిణీపై కేంద్రం కఠిన నిబంధనలు విధించింది.

గత మూడు రోజుల నుంచి దేశంలో ఒకటే దాని గురించి చర్చ.. గ్యాస్ సిలిండర్ రేట్స్ అమాంతం పెరగడంతో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అసలు ఇంకా ఉగాది కూడా రాక ముందే అసలు ఈ కష్టాలు ఏంటి బాబోయ్ అంటూ.. జనాలు భయపడుతున్నారు.

అటు గ్యాస్ ధరలను కేంద్రం ఇటీవల భారీగా పెంచింది. ఏకంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై రూ.60 మేర పెంచగా.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.115 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యుద్దం ఇలాగే కొనసాగితే గ్యాస్ ధరలు మరింత పెరగనున్నాయని తెలుస్తోంది. యుద్దం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది తెలియడం లేదు.