
దేశంలోనే కొల్లాపూర్ మామిడికి ప్రతి ఏటా ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ సారవంతమైన నేలలో పండే మామిడి అమృతం వంటి రుచి, శ్రేష్ఠమైన రంగు, వాసనతో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సీజన్ లోనే అన్ని ప్రాంతాల్లో కంటే ముందే ఇక్కడ మామిడి దిగుబడి జరుగుతుంది. దీంతో మార్కెట్లకు మొదటగా చెరుకునేది సైతం ఈ ప్రాంతంలో పండిన మామిడే. ఈ ఏడాది సుమారు 35వేల ఎకరాల్లో మామిడి పంట సాగు జరుగుతోంది.

సుమారు 13వేలకు పైగా రైతులు ఈ మామిడి పంటను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. నూజీవీడు, బంగినపల్లి బేనిషాన్, రసాలు, తోతాబరి, మల్ గూబ, రాణిపసంద్ తదితర రకాల పండ్లు కొల్లాపూర్ నియోజకవర్గంలో పండిస్తారు. ఇక్కడి నేల స్వభావం, నీటి లక్షణాల కారణంగా కొల్లాపూర్ మామిడికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దేశీయంగా ఎంతో గుర్తింపు ఉన్న ఇక్కడి మామిడి అమెరికా, మలేషియా, అరబ్, యూరప్ దేశాలకు ఎగుమతి అవుతుంది.

నాలుగేళ్లుగా వదలని నల్లతామర తెగులు: గడిచిన నాలుగేళ్లు గా కొల్లాపూర్ మామిడి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. నల్లతామర, తేనేమంచు, బుడిద తెగుళ్ల మామిడి పూతను పట్టిపీడిస్తున్నాయి. దీనికి తోడు వాతావరణ పరిస్థితులు సైతం అనుకూలించడం లేదు. పూత, కాత లేక దిగుబడులు సగానికి పైగా పడిపోయాయి. చూస్తే పచ్చగా, తెల్లని పూతతో కనిపిస్తున్న తోటలు. కాయలే లేక వెలవెలబోతున్నాయి. ఈ సమయానికి కాయలతో మార్కెట్ కు తరలాల్సిన ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఎన్నిరకాల మందులు వాడినా తెగుళ్లు నియంత్రణలోకి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక ఎకరం మామిడితోట ఉంటే లక్షాధికారిగా జీవించే రైతులు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నా.. ఆశించిన స్థాయిలో దిగుబడి రాక అర్థికంగా నష్టపోతున్నారు. ఒక్కో ఎకరాకు సుమారుగా రూ.లక్ష వరకు ఖర్చు చేసి ఏడాదంత కష్ఠపడితే వాతావరణం, తెగుళ్ల కారణంగా అప్పుల పాలయ్యే పరిస్థితులు వచ్చాయని వాపోతున్నారు. ఇక కాస్తో కూస్తో వచ్చిన మామిడి పిందెలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. తెగుళ్ల నుంచి రక్షణగా ఉద్యానవన శాఖ అందజేస్తున్న కవర్లను మామిడి కాయలకు కడుతున్నారు.

ఏడాది మొత్తం కష్టపడితే మూడు నెలల పాటు వచ్చే మామిడి దిగుబడి అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కొల్లాపూర్ లో స్థానికంగా మామిడి మార్కెట్ ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పట్నం బాట పడుతున్నారు. కోల్డ్ స్టోరేజీ, గ్రేడింగ్, ప్యాకింగ్ వసతులు కల్పిస్తామన్న ప్రభుత్వాల హామీలు అమలు కావడం లేదు. దీంతో దళారులు, వ్యాపారుల మోసాలకు మామిడి రైతులు బలవుతున్నారు. కొల్లాపూర్ ప్రాంతంలోని మామిడి చెట్లను ప్రధానంగా నల్లతామర తెగుళు పీడిస్తోంది.

కీలకమైన దశలో ఈ మహమ్మారి మామిడి పూతను ఎదగనివ్వకుండా చేస్తోందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ఎన్ని రకాల కెమికల్స్ ఉపయోగించిన నల్లతామర తెగుళును నియంత్రించలేకపోతున్నామని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. దీని నియంత్రణ కోసం సైంటిస్టులు, అధికారులు సర్వే చేశారని చెప్పారు.ఏది ఏమైనా ఈ ఏడాది సైతం కొల్లాపూర్ మామిడి రైతులకు కలిసిరాలేదు.